జగన్ ప్రెస్ మీట్ పై లోకేష్ రియాక్షన్

తానింకా రెడ్ బుక్ తెరవలేదని, ఆ రెడ్ బుక్ తెరవక ముందే జగన్‌ ఢిల్లీ వెళ్లి గొడవ చేస్తున్నారని అన్నారు లోకేష్.

Advertisement
Update: 2024-07-26 12:28 GMT

మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. శ్వేత పత్రాల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. మరోవైపు ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయన్నారు. అప్పుల విషయంలో గగ్గోలు పెడుతున్నారని, గతంలో తప్పు చేసింది, ఇప్పుడు తప్పులు చేస్తోంది టీడీపీయేనన్నారు. జగన్ లేకపోవడం వల్ల అమ్మఒడి ఆర్థిక సాయం రాలేదని, రైతుబంధు జమకాలేదని, విద్యాదీవెన విడుదల చేయలేదని, సున్నావడ్డీ రుణాలు ఇవ్వలేదని చెప్పారు. హామీలు అమలు చేయడం చేతగాక, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో బండి లాక్కొస్తున్నారంటూ కొత్త ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు జగన్. ఈ ప్రెస్ మీట్ తర్వాత వెంటనే టీడీపీ నుంచి కౌంటర్ పడింది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, జగన్ ప్రెస్ మీట్ పై వెటకారంగా స్పందించారు.

అధికారంలో ఉన్న ఐదేళ్లలో రెండు ప్రెస్‌మీట్లు పెట్టిన జగన్‌.. 11 సీట్లు వచ్చిన నెలలోపే ఐదు ప్రెస్‌మీట్లు పెట్టారని ఎద్దేవా చేశారు లోకేష్. జగన్‌ చెప్పే అసత్యాలకు.. అసెంబ్లీకి వస్తే బదులిస్తామన్నారు. అసెంబ్లీకి రాకుండా తప్పించుకోడానికే ఆయన ఢిల్లీకి వెళ్లారని సెటైర్లు పేల్చారు. ఢిల్లీ వెళ్లి జగన్ జాతీయ మీడియాని బతిమిలాడుకుంటున్నారని అన్నారు లోకేష్. గతంలో జాతీయ మీడియా ప్రశ్నించినా పక్కకు తప్పుకొని వెళ్లిపోయిన ఆయన, ఇప్పుడు అదే మీడియాని బతిమాలి పిలిపించుకుని మాట్లాడుతున్నారని చెప్పారు లోకేష్.

రెడ్ బుక్..

ఇక రెడ్ బుక్ అంటూ ఢిల్లీలో జగన్ చేసిన వ్యాఖ్యలకి కూడా లోకేష్ బదులిచ్చారు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్‌ బుక్‌లో నోట్ చేశానని అన్నారు. వారికి చట్ట ప్రకారం శిక్షలు పడతాయని, ఆ విషయంలో తాను మాటకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. తానింకా రెడ్ బుక్ తెరవలేదని గుర్తు చేశారు. రెడ్‌ బుక్‌ తెరవక ముందే జగన్‌ ఢిల్లీ వెళ్లి గొడవ చేస్తున్నారని అన్నారు లోకేష్. 

Tags:    
Advertisement

Similar News