పిక్చర్ అభీ బాకీహై.. రుషికొండపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
తమ కార్యకర్తలు నిజంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తే వైసీపీ వాళ్లు ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలని హెచ్చరించారు లోకేష్.
ఏపీలో ప్రస్తుతం రాజకీయమంతా రుషికొండ చుట్టూనే తిరుగుతోంది. కొన్ని ఫొటోలు, వీడియోలు బయటకు వదిలి రుషికొండ ఏదో వింతైన ప్రాంతం అన్నట్టుగా కలరింగ్ ఇస్తున్నారు టీడీపీ నేతలు. వైసీపీ దీనికి కౌంటర్ ఇచ్చినా టీడీపీ రాద్ధాంతం ఆగలేదు. తాజాగా మంత్రి నారా లోకేష్ రుషికొండపై తనదైన శైలిలో స్పందించారు. రుషికొండ ప్యాలెస్ వ్యవహారంలో ఇంకా బయటికి రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు లోకేష్.
తట్టుకోలేరు జాగ్రత్త..
ఏపీలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముగ్గురు టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేతలు హత్య చేశారని, అయినా తాము సంయమనం పాటిస్తున్నామన్నారు లోకేష్. శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని సీఎం చంద్రబాబు ఆదేశించారని, ఆ ఆదేశాలను తాము పాటిస్తున్నామని చెప్పారు. తమ కార్యకర్తలు నిజంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తే వైసీపీ వాళ్లు ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలని హెచ్చరించారు లోకేష్.
100 డేస్ ప్రణాళిక..
రాబోయే 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్ పెడతామని అన్నారు నారా లోకేష్. ప్రజా దర్బార్‌ను అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. బక్రీద్ ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన.. ఈరోజు కూడా ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుకుని వాటిని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. వైసీపీ నేతలు తమ భూముల్ని అక్రమంగా లాక్కున్నారని చాలా ఫిర్యాదులు అందాయని, విచారణ జరిపిస్తామని చెప్పారు లోకేష్.