తెరమరుగైన లోకేష్.. ఎందుకంటే..?
ఏపీలో ఎన్నికల వేడి మొదలయ్యాక నారా లోకేష్ తెరమరుగయ్యారు. పూర్తిగా మంగళగిరికే పరిమితం అయ్యారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు పాదయాత్రలు, ప్రజా యాత్రలంటూ హడావిడి చేసిన నారా లోకేష్.. తీరా ఎన్నికల వేడి మొదలయ్యాక మాత్రం తెరమరుగయ్యారు. కేవలం మంగళగిరికి మాత్రమే ఆయన పరిమితమయ్యారు. పోనీ అక్కడైనా పార్టీ గెలుపుకోసం చెమటోడుస్తున్నారా అంటే అదీ లేదు. బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్, డిన్నర్ విత్ లోకేష్ అంటూ.. చిత్ర విచిత్రమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లోకేష్ భజన బృందాలకు ఈ కార్యక్రమాలన్నీ మహదానందాన్ని ఇస్తున్నా.. అక్కడ వైసీపీ శ్రేణులు మాత్రం గెలుపుపై ధీమా పెంచుకుంటున్నాయి. బీసీ మహిళా అభ్యర్థి చేతిలో లోకేష్ ఓటమి ఖాయం అంటున్నారు వైసీపీ నేతలు.
ప్రస్తుతం ఏపీలో యాత్రల సీజన్ నడుస్తోంది. వైసీపీ తరపున సీఎం జగన్ బస్సుయాత్ర చేస్తున్నారు. టీడీపీ తరపున చంద్రబాబు ప్రజాగళం అంటూ పర్యటిస్తున్నారు. జనసేన తరపున పవన్ కల్యాణ్.. రెండు రోజుల పర్యటన మూడు రోజుల విశ్రాంతి అన్నట్టుగా వారాహిపై వస్తున్నారు. బీజేపీ తరపున అధికారికంగా ఎవరూ యాత్రలు మొదలు పెట్టలేదు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలితో సహా ఎవరికి వారు తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. మిగతా రాష్ట్ర స్థాయి నాయకులు యాక్టివ్ గా లేరు. అందరి సంగతి సరే మరి లోకేష్ సంగతేంటి..? చంద్రబాబు భావి వారసుడిగా టీడీపీ, ఎల్లో మీడియా ప్రొజెక్ట్ చేస్తున్న లోకేష్.. మంగళగిరి దాటి ఎందుకు బయటకు రావడంలేదు..?
డ్యామేజ్ కంట్రోల్..
యువగళం యాత్రతో నారా లోకేష్ జనంలోకి వస్తే టీడీపీ క్రేజ్ పెరగాల్సింది పోయి తగ్గిపోయింది. యువగళం అట్టర్ ఫ్లాప్ షో అని తేలిపోయింది. అందుకే చంద్రబాబు ఇప్పుడు ప్రజాగళం అంటూ బయలుదేరారు. లోకేష్ చేసిన డ్యామేజీని కంట్రోల్ చేసుకునేలా యాత్ర కొనసాగిస్తున్నారు. పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేసేందుకు చంద్రబాబు ఒప్పుకున్నారు కానీ, లోకేష్ బయటకు వెళ్తానంటే మాత్రం ఒప్పుకోవడంలేదు. వీలైనంత మేర ఆయన్ను ప్రచార పర్వానికి దూరంగా ఉంచడమే మేలని భావించారు. దీంతో లోకేష్ మంగళగిరికే పరిమితం అయ్యారు.