సీఎం కుర్చీపై లోకేష్ క్లారిటీ..
జగన్ హయాంలో కరెంట్ ఛార్జీలు 9 సార్లు, ఆర్టీసి ఛార్జీలు 3సార్లు పెంచారని, చెత్త పన్ను, ఇంటి పన్ను, పెట్రోల్, డీజిల్ ధరలు, విపరీతంగా పెరిగిపోయాయని, తాము అధికారంలోకి వస్తే వాటన్నిటినీ తగ్గించేస్తామన్నారు లోకేష్.
ఏపీలో టీడీపీ అధికారంలోకి రాగానే జగన్ పెంచిన పన్నులన్నిట్నీ తగ్గించేస్తామని హామీ ఇచ్చారు నారా లోకేష్. యువగళం పాదయాత్రలో భాగంగా 150వరోజు పర్యటన చేస్తున్న ఆయన 2వేల కిలోమీటర్ల మైలురాయిని దాటారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి సమీపంలో కొత్తపల్లి గ్రామస్తులతో ఆయన రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న జగనోరా వైరస్ కి చంద్రబాబే సరైన వ్యాక్సిన్ అని చెప్పారు.
బాబు అంటే బ్రాండ్ అని, జగన్ అంటే జైలు అని సెటైర్లు పేల్చారు లోకేష్. లోటు బడ్జెట్ తో రాష్ట్రం విడిపోయినా ఎవరికి లోటు లేకుండా చంద్రబాబు పాలన సాగించారన్నారు. అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా, విదేశీ విద్య లాంటి సంక్షేమ కార్యక్రమాలు తమ హయాంలో అమలయ్యాయని, వాటన్నిటినీ జగన్ రద్దు చేశారని చెప్పారు. పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షలమంది యువతకు ఉద్యోగాలిప్పించామని చెప్పారు. ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టగానే ప్రజలు పడిపోయారని, పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారని వెటకారం చేశారు.
జగన్ హయాంలో కరెంట్ ఛార్జీలు 9 సార్లు, ఆర్టీసి ఛార్జీలు 3సార్లు పెంచారని, చెత్త పన్ను, ఇంటి పన్ను, పెట్రోల్, డీజిల్ ధరలు, విపరీతంగా పెరిగిపోయాయని, తాము అధికారంలోకి వస్తే వాటన్నిటినీ తగ్గించేస్తామన్నారు. బీసీలకు కుర్చీ, టేబుల్ లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారంటూ ఎద్దేవా చేశారు. సక్సెస్ కి షార్ట్ కట్ లేదని, యువత కష్టపడితేనే జీవితంలో విజయం సాధిస్తారని ఉపదేశమిచ్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన కోర్టు దొంగ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారని కౌంటర్లిచ్చారు లోకేష్. కాకాణికి రైతు సమస్యల పై అవగాహన తక్కువ, కల్తీ లిక్కర్ పై అవగాహన ఎక్కువ అన్నారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగాలు లేని యువతకు ప్రతి నెలా రూ.3 వేలు నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. జగన్ రద్దు చేసిన 6 లక్షల పింఛన్లను కూడా తిరిగి ఇస్తామని చెప్పారు. మహిళల సమస్యలు తెలుసుకున్న తర్వాత మహాశక్తి కార్యక్రమం ప్రకటించామని చెప్పారు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1500 ఇస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే లోకేష్ సీఎం అవుతారా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. తాను రాష్ట్రం కోసం పోరాడుతున్నానని, చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రాన్ని గాడిలో పెడతారని చెప్పారు.