మీకు 15 వేలు, మీకు 15 వేలు, మీకు 15వేలు..

తల్లికి వందనంపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. మంత్రి హోదాలో ఈరోజు శాసన మండలి సమావేశాలకు హాజరైన ఆయన తల్లికి వందనంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు.

Advertisement
Update:2024-07-24 13:30 IST

మీకు 15వేలు, మీకు 15వేలు అనేది ఇటీవల కాలంలో ఏపీలో పెద్ద జోక్ గా మారింది. ఒక తల్లికి స్కూల్ కి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే, అంతమందికీ తల్లికి వందనం పేరుతో ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది టీడీపీ. సూపర్ సిక్స్ లోని ఆ హామీ నెరవేర్చడంలో వెనకడుగు వేశారని, ఒక తల్లికి ఒక బిడ్డకు మాత్రమే ఆ పథకం అమలు చేయబోతున్నారంటూ వైసీపీ విమర్శలు మొదలు పెట్టింది. ఇటీవల జగన్ కూడా ఇదే విషయంపై టీడీపీపై సెటైర్లు పేల్చారు. మీకు 15వేలు, మీకు 15వేలు అంటూ అందర్నీ మోసం చేశారన్నారు. ఈమధ్య ఇది సెల్ ఫోన్ రింగ్ టోన్ గా కూడా రావడం విశేషం.


ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. మంత్రి హోదాలో ఈరోజు శాసన మండలి సమావేశాలకు హాజరైన ఆయన తల్లికి వందనంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. బడికి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే వారందరికీ తల్లికి వందనం ఆర్థిక సాయం అందుతుందని తేల్చి చెప్పారు. అదే సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ అనే తేడా లేకుండా ఈ పథకం అమలు చేస్తామన్నారు.

వైసీపీ హయాంలో నాడు-నేడు పేరుతో నిధుల దోపిడీ జరిగిందని మరోసారి విమర్శించారు మంత్రి నారా లోకేష్. నాడు-నేడుతో ఏదో జరిగిపోయిందని చెప్పినా కూడా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిందన్నారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా సరికొత్త బోధనా పద్ధతులు అమలు చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు లోకేష్. ప్రభుత్వ స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తామన్నారు. 

Tags:    
Advertisement

Similar News