సీఐడీ వాళ్లు నన్ను ఏమేం ప్రశ్నలు అడిగారంటే..?
సీఐడీ విచారణలో తాను ఎలాంటి స్టేట్ మెంట్లపై సంతకాలు పెట్టలేదన్నారు లోకేష్. సీఐడీ వాళ్ల ప్రశ్నలన్నిటికీ తాను ఈరోజే సమాధానం చెబుతానన్నానని, కానీ రేపు మళ్లీ రమ్మన్నారని చెప్పారు.
తొలిరోజు సీఐడీ విచారణ తర్వాత నారా లోకేష్, ప్రెస్ మీట్ లో ఆ వివరాలు తెలిపారు. లోపల తనను సీఐడీ అధికారులు ఏమేం ప్రశ్నలు అడిగారో చెప్పారు. కేవలం ప్రశ్నలను మాత్రమే ఆయన బహిర్గతం చేశారు. గూగుల్ లో వెదికితే సమాధానం దొరికే ప్రశ్నల్ని కూడా తనను అడిగారని అన్నారు లోకేష్. దొంగ కేసులు పెట్టి విచారణకు పిలిచారని, సీఐడీ విభాగం ముఖ్యమంత్రి కింద పనిచేస్తోందన్నారు. ఏసీబీ, సీఐడీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగాలని.. ఆ విషయం సీఎం జగన్ కి తెలియదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్, తాను లండన్ లో ఉన్నప్పుడు జరిగిందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా లోకేష్ స్పందించారు. మరి తనకు నోటీసులిచ్చింది, ఆయన ఇక్కడ ఉన్నప్పుడే కదా అని ప్రశ్నించారు.
రేపు మళ్లీ విచారణ..
సీఐడీ విచారణలో తాను ఎలాంటి స్టేట్ మెంట్లపై సంతకాలు పెట్టలేదన్నారు లోకేష్. సీఐడీ వాళ్ల ప్రశ్నలన్నిటికీ తాను ఈరోజే సమాధానం చెబుతానన్నానని, కానీ రేపు మళ్లీ రమ్మన్నారని చెప్పారు. తొలిరోజు విచారణలోనే లోకేష్ కి సీఐడి అధికారులు మళ్లీ 41-ఎ నోటీసులిచ్చారు. రేపు కూడా తాను ఠంచనుగా ఉదయం 10గంటలకే సీఐడీ ఆఫీస్ కి వస్తానని చెప్పారు లోకేష్.
చంద్రబాబుని జైలుకి పంపించినా, ఎక్కడా టీడీపీ కార్యక్రమాలు ఆగలేదన్నారు లోకేష్. ముందు ముందు కూడా కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. తమ పార్టీలో ఎలాంటి ఆందోళన లేదన్నారు. ఆ మూడు ఛానెళ్లకు సీఐడీ అధికారులు సెలక్టివ్ గా లీకులిచ్చారని మండిపడ్డారు లోకేష్. ఢిల్లీలో తానెక్కడికీ పారిపోలేదని వివరణ ఇచ్చారు. గంట, అరగంట మంత్రి అనే మాటలకి కూడా తాను సమాధానం ఎందుకు చెప్పాలని ప్రశ్నించారు లోకేష్. అసలు పోలవరం ప్రాజెక్ట్ కి ఎన్ని గేట్లుంటాయనే విషయం అంబటి రాంబాబుకి తెలుసా అని అడిగారు.