అమరావతి పనులు మొదలు పెడతాం.. లోకేష్ కొత్త పల్లవి
మంగళగిరిలో ఓట్లకోసం అమరావతి అభివృద్ధి అంటూ లోకేష్ కొత్త ప్లాన్ వేశారు.
ఇటీవల కాలంలో అమరావతి వ్యవహారంలో టీడీపీ కాస్త సైలెంట్ గా ఉంది. అమరావతికి సపోర్ట్ చేస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వ్యతిరేకత ఎదురవుతున్న సందర్భంలో అమరావతి గురించి హడావిడి చేయడం మానేశారు నేతలు. కానీ కూటమిలో బీజేపీ కలయికతో టీడీపీ-జనసేన కొత్త రాగం అందుకున్నాయి. అమరావతి పనుల్ని తిరిగి ప్రారంభిస్తామని నిన్న మోదీ సభలో చెప్పారు పవన్ కల్యాణ్. తాజాగా నారా లోకేష్ కూడా అమరావతి పేరుతో మంగళగిరిలో ఓట్లు రాబట్టాలని చూస్తున్నారు.
అప్పులతో కాకుండా అభివృద్ధి పనులతో రాష్ట్ర ఆదాయం పెంచి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నది తెలుగుదేశం పార్టీ విధానమని ప్రకటించారు నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గంలో బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ అనే కార్యక్రమం ద్వారా ఆయన జనాల్లోకి వెళ్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సమగ్ర ప్రణాళిక తమ వద్ద ఉందన్నారు. పరిశ్రమలు రప్పించడం ద్వారా లక్షల ఉద్యోగాలు కల్పిస్తే రాష్ట్ర ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు లోకేష్. ఆదాయం పెంపుదల ద్వారా ఇప్పటికంటే మెరుగైన సంక్షేమాన్ని ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటుందన్నారు. జగన్ మూడు ముక్కలాటతో తీవ్రంగా నష్టపోయామని, మూడు ప్రాంతాల్లో ఏ ఒక్కటి కూడా అభివృద్ధి చెందలేదన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ కంటే దారుణంగా తయారయ్యాయని విమర్శించారు.
ఒకేరాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానం అని చెప్పారు లోకేష్. ఐదేళ్లుగా అమరావతిలో పనులు ఆగిపోయాయని, తాము అధికారంలోకి వచ్చాక వెంటనే వాటిని తిరిగి ప్రారంభిస్తామని అన్నారు. వచ్చే 10 ఏళ్లలో సమర్థమైన ప్రభుత్వం ఉంటేనే ఈ కష్టాల నుంచి గట్టెక్కగలమని చెప్పారు. రెండు నెలలు ఓపిక పడితే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తామన్నారు. మొత్తమ్మీద మళ్లీ అమరావతిని తెరపైకి తేవాలని చూస్తున్నారు టీడీపీ-జనసేన నేతలు. మంగళగిరిలో ఓట్లకోసం అమరావతి అభివృద్ధి అంటూ లోకేష్ కొత్త ప్లాన్ వేశారు. ముగిసిపోయిన అమరావతి కథను మళ్లీ మొదలు పెట్టినా టీడీపీకి ప్రయోజనం ఉండకపోవచ్చు. అమరావతి ప్రాంతంలో ఓట్లు పడకపోగా.. మిగతా ప్రాంతాల్లో లేనిపోని వ్యతిరేకత మూటగట్టుకునే అకాశం ఉంది.