బోరున ఏడ్చిన నందిగామ మున్సిప‌ల్‌ చైర్‌పర్సన్‌ వరల‌క్ష్మి

సమావేశానికి సంబంధించిన ఎజెండా కాపీలను తనకు పంపలేదని పక్కనే ఉన్న ఎమ్మెల్యేకు చెప్పుకుని ఆవేదన చెందారు. ఎజెండా కాపీనే ఇవ్వకుండా సమావేశాలు నిర్వహించాలంటే ఎలా అని ప్రశ్నించారు.

Advertisement
Update:2023-01-30 16:56 IST

కృష్ణా జిల్లా నందిగామ మున్సిపల్ చైర్‌ పర్సన్‌ మండవ వరల‌క్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్యే సమక్షంలోనే ఆమె ఏడ్చేశారు. నగర పంచాయతీ అధికారులు తనకు ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని ఆమె వాపోయారు. మున్సిపాలిటీకి సంబంధించి బడ్జెట్ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగానే అధికారులు తనను గుర్తించడం లేదని చైర్‌పర్సన్ ఆరోపించారు. సమావేశానికి సంబంధించిన ఎజెండా కాపీలను తనకు పంపలేదని పక్కనే ఉన్న ఎమ్మెల్యేకు చెప్పుకుని ఆవేదన చెందారు. ఎజెండా కాపీనే ఇవ్వకుండా సమావేశాలు నిర్వహించాలంటే ఎలా అని ప్రశ్నించారు. ఈ అంశంపై ఎమ్మెల్యే నిలదీయడంతో తాము సభ్యులందరికీ వారం క్రితమే ఎజెండా కాపీలను పంపామని అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

అధికారుల మాటలను ఆమె ఖండించారు. ఎజెండా పంపి ఉంటే తాను పంపలేదని ఎందుకు చెబుతానని ప్రశ్నించారు. ప్రతి విషయంలోనూ తనను చిన్నచూపు చూస్తూ అవమానిస్తున్నారన్నారు. మీరు అందుబాటులో లేకపోవడంతో మీ పీఏకు ఇచ్చి వచ్చామంటూ సిబ్బంది వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాంతో వరల‌క్ష్మి ఆ విషయాన్ని కనీసం ఫోన్ చేసి తనకు చెప్పాలి కదా.. దీన్నే లెక్కలేని తనం అంటారని విమర్శించారు. అధికారుల తీరుకు నిరసనగా ఆమె సమావేశాన్ని వాయిదా వేశారు.

అధికారుల తీరుపై కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారు. చైర్‌పర్సన్ సంతకంతోనే తమకు సమావేశానికి సంబంధించిన కాపీలను పంపారని.. అందులో తేదీ మాత్రం పెన్సిల్‌లో రాశారని.. తొలుత తాము ఆ విషయాన్ని పట్టించులేదన్నారు. చివరకు చైర్‌పర్సనే తనకు ఎజెండా గురించి తెలియదని చెప్పడంతో.. పాత నోటీసులపై డేట్లు మార్చి అధికారులే ఎజెండాను నిర్ణయించినట్టుగా స్పష్టమవుతోందన్నారు. ఇక్కడ ఏం జరుగుతోందో ప్రజలు కూడా ఆలోచన చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇంకా ఏఏ పనులు చైర్‌పర్సన్‌ను తెలియకుండా జరుగుతున్నాయో తేల్చాలని డిమాండ్ చేశారు.

చైర్‌పర్సన్‌ కన్నీరు పెట్టుకుని తనను అవమానిస్తున్నారు, తనను లెక్కచేయడం లేదు అని చెప్పిన తర్వాత కమిషనర్‌ మీడియా సమావేశం పెట్టి కాపీలను పంపలేదన్న మాట అవాస్తమని చెప్పారు. తాము ఎజెండా కాపీలను పంపామని.. చైర్‌పర్సన్ పీఏ వాటిని తీసుకున్నారని అధికారి వివరించారు. తమ వైపు నుంచి ఎలాంటి తప్పు చేయలేదన్నారు.

Tags:    
Advertisement

Similar News