కేంద్ర సహకారం బ్రహ్మాండమట..

విభజన చట్టానికి మోడీ ప్రభుత్వం తూట్లు పొడిచేశారు. ప్రత్యేక హోదా ఇచ్చేదిలేదన్నారు. రైల్వేజోన్ సాధ్యంకాదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రచారం నిధులు కుదరదన్నారు. చివరకు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కూడా ప్రైవేటీకరించేస్తున్నారు. ఇవన్నీ కిరణ్‌కు కనబడినట్లు లేదు.

Advertisement
Update:2023-04-13 10:04 IST

ఏరోటికాడ పాట ఆ రోటికాడ పాడాలనే సామెత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. బీజేపీలో చేరారో లేదో వెంటనే ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం బ్రహ్మాండంగా అందుతోందని మొదలుపెట్టేశారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం అంత బ్రహ్మాండంగా ఏం సహకరిస్తోందో నల్లారి వారే చెప్పాలి. ఒకవైపు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఏపీ ప్రయోజనాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేస్తోందని జనాలు గగ్గోలు పెట్టేస్తున్నారు.

జనాలు గగ్గోలు పెట్టడం కాదు ప్రయోజనాలను తుంగలో తొక్కేయటం కళ్ళకు కనబడుతోంది. అందుకనే మోడీ ప్రభుత్వం మీద కసిని జనాలు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి చూపుతునే ఉన్నారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడించటం ద్వారా మోడీ ప్రభుత్వంపై జనాలు తమ నిరసనను తెలియజేస్తున్నారు. కిరణ్‌కు జనాల నిరసన కనబడటంలేదేమో. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన నియోజకవర్గాల్లో బీజేపీకి ఒక్కచోట కూడా డిపాజిట్ రాలేదంటే అర్థ‌మేంటి? అలాగే తర్వాత జరిగిన మూడు ఉప ఎన్నికల్లో ఎందులోనూ డిపాజిట్లు దక్కలేదు.

విభజన చట్టానికి మోడీ ప్రభుత్వం తూట్లు పొడిచేశారు. ప్రత్యేక హోదా ఇచ్చేదిలేదన్నారు. రైల్వేజోన్ సాధ్యంకాదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రచారం నిధులు కుదరదన్నారు. చివరకు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కూడా ప్రైవేటీకరించేస్తున్నారు. ఇవన్నీ కిరణ్‌కు కనబడినట్లు లేదు. నిజానికి పైవన్నీ విభజన చట్టం ద్వారా ఏపీకి హక్కుగా రావాల్సినవే. అయినా ఇచ్చేది లేదు పొమ్మన్నారు మోడీ. ఈ విషయాలను అడిగితే కిరణ్ ఏమి చెబుతారో.

ఇంకా విచిత్రం ఏమిటంటే తన సేవలు ఎక్కడ అవసరమని పార్టీ నాయకత్వం భావిస్తే అక్కడ సేవ చేయటానికి రెడీగా ఉన్నారట. ఈయన సేవలు ఎక్కడ అవసరమవుతాయని అగ్ర నాయకత్వం అనుకుంటోందో తెలియ‌దు. మొదటి నుండి కూడా కిరణ్ వాయల్పాడు నియోజకవర్గానికి ఎక్కువ జిల్లాకు తక్కువ. కేవలం ఒక్క నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారంటే కేవలం అదృష్టం తప్ప ఇంకోటి కానేకాదు. ఎలాగూ చేరారు కదా కొద్ది రోజులు వెయిట్ చేస్తే కేంద్ర సహకారం ఎందులో బ్రహ్మాండమో, కిరణ్ సేవలు ఏమిటో రాబోయే ఎన్నికల్లో తేలిపోతుంది.

Tags:    
Advertisement

Similar News