సీఎం.. సీఎం.. ఈసారి నాగబాబు మొదలెట్టారు
ఏ పదవీ లేకపోయినా, ఒక వ్యక్తిగా పవన్ సమాజానికి ఎంతో చేస్తున్నారని, ఇక సీఎం అయితే పవన్ ఇంకెంత చేస్తారో అని ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చారు నాగబాబు.
పవన్ కల్యాణ్ ఎక్కడికి వెళ్లినా జనసైనికులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ హడావిడి చేస్తుంటారు. మొదట్లో ఈ హడావిడిని పవన్ ఎంజాయ్ చేసినా, ఆ తర్వాత విసుక్కునేవారు, ఇక చాలు బాబోయ్ అనేవారు. మీరు అరుస్తారంతే ఓట్లు మాత్రం వేయరంటూ అభిమానులపై పవన్ సెటైర్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల పొత్తుల ఎత్తుల్లో తాను సీఎం కాలేను అంటూ తేల్చేశారు పవన్ కల్యాణ్. అయితే ఇప్పుడు మళ్లీ వారాహి యాత్ర సందర్భంగా పవన్ కల్యాణ్ సీఎం కావాలనే ఆకాంక్ష తెరపైకి వచ్చింది. అయితే ఈసారి ఈ కోరికను బయటపెట్టింది ఆయన అన్నయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కావడం విశేషం.
వారాహి ప్రచారం, ప్రకటన, చర్చలు, రూట్ మ్యాప్... అన్నిట్లో నాదెండ్ల మనోహర్ కీలకంగా ఉండగా ఇప్పుడు నాగబాబు ఈ యాత్ర గురించి ఓ ప్రకటన విడుదల చేశారు. జనసైనికుల్ని ఉత్సాహపరుస్తూ, వారాహి యాత్రకు కదలి రావాలని సూచించారు. అయితే అందులో పవన్ ని సీఎం చేసుకోవాలంటూ ఆయన చెప్పిన మాట ఆసక్తిగా మారింది. తనకు తాను సీఎం కాలేనంటూ పవన్ కల్యాణ్ అస్త్ర సన్యాసం చేసిన వేళ, మళ్లీ నాగబాబు సీఎం సీఎం అనే స్లోగన్ ని తెరపైకి తెచ్చారు.
ఏ పదవీ లేకపోయినా, ఒక వ్యక్తిగా పవన్ సమాజానికి ఎంతో చేస్తున్నారని, ఇక సీఎం అయితే పవన్ ఇంకెంత చేస్తారో అని ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చారు నాగబాబు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నుంచి ఏపీ గట్టెక్కాలంటే జనసేన పాలన రావాల్సిందేనన్నారు నాగబాబు. ప్రజాధనం ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా, అప్పులు అదుపు చేసి, అభివృద్ధి బాటలు వేయగల సమర్థత గల నాయకుడు పవన్ అని చెప్పారు. ఏపీ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పు కోసం శంఖారావం మోగించడానికి వారాహి బయలు దేరుతోందన్నారు. వారాహి యాత్రను విజయవంతం చేయాలని జనసైనికులకు ఆయన పిలుపునిచ్చారు.