జగన్ పై దాడి ఘటనలో హత్యాయత్నం కేసు.. ఫిర్యాదు చేసింది ఎవరంటే..?

సీఎం జగన్‌పై దాడిని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. విజయవాడ సీపీ కాంతి రాణాను సీఈఓ నివేదిక కోరారు. సీపీ నుంచి ప్రాథమిక సమాచారాన్ని సీఈవో ముకేష్ కుమార్ మీనా తీసుకున్నారు.

Advertisement
Update:2024-04-14 16:08 IST

సీఎం జగన్ పై జరిగిన రాళ్లదాడి ఘటన విషయంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విజయవాడ సింగ్ నగర్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. హత్యాయత్నం, ఐపీసీ సెక్షన్‌ 307 కింద కేసు నమోదు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో సీఎం జగన్ తోపాటు ఆయన కూడా బాధితుడే. ఆయన ఎడమ కంటికి కూడా రాయి తగలడంతో చికిత్స తీసుకుంటున్నారు.

ప్రత్యేక బృందాలు..

నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఇప్పటికే గాలింపు మొదలు పెట్టాయి. ఘటనాస్థలంలో పోలీసులు ఆధారాలు సేకరించారు. పక్కా ప్లాన్‌ ప్రకారం ఈ దాడి జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. క్లూస్‌ టీమ్‌ వివరాలు సేకరించింది. సీసీ ఫుటేజ్‌ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాడి జరిగిన సమయంలో పలువురు వీడియోలు తీశారు, అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోలను కూడా పోలీసులు దర్యాప్తులో ఉపయోగించుకుంటున్నారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుండగా.. ఏసీపీ స్థాయి అధికారులతో ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

దాడికి ఉపయోగించినది రాయా లేక ఇతర పదునైన వస్తువా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతంలో అలాంటి వస్తువులు ఉన్నాయేమోనని జల్లెడ పడుతున్నారు. ఎయిర్ బుల్లెట్ ఆనవాళ్లు ఉంటాయేమోనని గాలిస్తున్నారు. పక్కనే ఉన్న స్కూల్‌ భవనంలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఉండగా.. స్కూల్‌ బిల్డింగ్‌ను సీపీ కాంతి రాణా పరిశీలించారు. స్కూల్‌కు, గంగానమ్మ గుడికి మధ్యలోని చెట్ల దగ్గర నుంచి దాడి జరిపినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. సీఎం జగన్‌పై దాడిని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. విజయవాడ సీపీ కాంతి రాణాను సీఈఓ నివేదిక కోరారు. సీపీ నుంచి ప్రాథమిక సమాచారాన్ని సీఈవో ముకేష్ కుమార్ మీనా తీసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News