సీబీఐ డొల్లతనం బయటపడిందా?

సీబీఐ వాదన ఇంత డొల్లగా ఉంది కాబట్టే ఎంపీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైప్రొఫైల్ హత్యకేసు విచారణ ఇంత నాసిరకంగా ఉంటే ఇక హత్యకు కారణమేమిటో సీబీఐ బయటపెట్టగలదా?

Advertisement
Update:2023-06-01 10:11 IST

ఏ విషయంలో అయినా ఒకరిపై మ‌రొక‌రు ఆరోపణలు చేసే ముందు ఏం చేస్తారు? తమ ఆరోపణలకు తగ్గట్లుగా ఆధారాలను దగ్గరుంచుకుంటారు. చేతిలో ఉన్న ఆధారాలకు తగ్గట్లే ఆరోపణలను బిల్డప్ చేస్తారు. దీన్ని కామన్ సెన్స్ అంటారు. అయితే తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఆరోపణలు చేసేదాన్ని ఏమంటారు? సింపుల్‌గా సీబీఐ అంటారు. ఇప్పుడు వివేకానందరెడ్డి మర్డర్ కేసులో సీబీఐ వైఖరి ఇలాగే ఉంది. చేతిలో ఎలాంటి ఆధారాలు లేకపోయినా కడప ఎంపీ అవినాష్ రెడ్డి పైన నోటికొచ్చిన ఆరోపణలు చేసేస్తోంది.

హైకోర్టులో సీబీఐ వాదనలోని డొల్లతనం బయటపడింది. అందుకనే ఎంపీకి బెయిల్ వచ్చేసింది. హత్యకేసులో ఎంపీని ఫిక్స్ చేయాలని సీబీఐ అనుకుంటే అందుకు తగ్గట్లే తిరుగులేని ఆధారాలను సేకరించి పెట్టుకోవాలి. ఆధారాలు లేకపోతే అసలు ఎంపీని ముట్టుకోకూడదు. కోర్టులో జడ్జి అడిగిన ప్రశ్నలకే సీబీఐ సమాధానం చెప్పలేక చేతులెత్తేసింది. అదేదో సినిమాలో డైలాగులాగ ప్రతి ప్రశ్నకు లేదు, తెలియ‌దు, కాదు అని మాత్రమే చెప్పింది. దాంతో ఎంపీకి బెయిల్ మంజూరైంది. జడ్జి అడిగిన ప్రశ్నలు ఏవంటే వివేకా హత్యలో అవినాష్ పాత్రుందని నిందితుల్లో ఎవరైనా చెప్పారా అని అడిగితే లేదని సమాధానమిచ్చింది. వివేకా డెడ్ బాడీ దగ్గర ఎంపీ సాక్ష్యాధారాలను చెరిపేసే ప్రయత్నం చేశారా అంటే లేదని చెప్పింది.

వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు పోలీసులకు ఎంపీ చెప్పారా అంటే కాదన్నది. డెడ్ బాడీని పోస్టుమార్టంకు తరలించాలని అవినాష్ తొందరపెట్టారా అంటే లేదన్నది. పోనీ సాక్ష్యులు ఎవరినైనా ఎంపీ బెదిరించారా అంటే ఎవరినీ బెదిరించలేదట. బెదిరిస్తున్నట్లు ఎంపీ మీద ఎవరైనా ఫిర్యాదు చేశారా అంటే ఎవరూ చేయలేదట. వివేకా మరణించారని తెల్లవారుజామున‌ 4 గంటలకు జగన్మోహన్ రెడ్డికి ఎంపీ ఫోన్ చేసి చెప్పినట్లు ఆధారాలున్నాయా అంటే లేదన్నది. వివేకా హత్యలో ఎంపీ పాత్రుందని ఎవరు చెప్పారంటే హత్యచేసిన దస్తగిరి చెప్పినట్లు సీబీఐ చెప్పింది.

దస్తగిరి దగ్గర ఇందుకు సంబంధించిన సాక్ష్యం ఏదన్నా ఉందా అంటే లేదట. అవినాష్‌కు బెయిల్ ఇవ్వకూడదనేందుకు ఒక్క కారణం చూపించమంటే ఒక్కటీ చూపించలేకపోయింది. అయినా సరే ఎంపీకి బెయిల్ ఇవ్వకుండా విచారణకు తమ కస్టడీకి అప్పగించాలని కోరింది. సీబీఐ వాదన ఇంత డొల్లగా ఉంది కాబట్టే ఎంపీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైప్రొఫైల్ హత్యకేసు విచారణ ఇంత నాసిరకంగా ఉంటే ఇక హత్యకు కారణమేమిటో సీబీఐ బయటపెట్టగలదా?

Tags:    
Advertisement

Similar News