తస్మదీయులకు సెక్యూరిటీ తగ్గింపు.. జగన్ లాజిక్ ఏంటంటే..?

అధికారుల అత్యుత్సాహమో, లేక అధిష్టానం ఆదేశమో తెలియదు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వెంటనే ఇలా భద్రత తగ్గించడం విమర్శలకు దారి తీస్తోంది. అనుకోకుండా వారిపై ప్రజల్లో సింపతీ పెరిగేందుకు దోహదపడుతోంది. కక్షసాధింపు అనే మాటకు తావిస్తోంది.

Advertisement
Update:2023-02-05 06:01 IST

ఆమధ్య వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మరుసటి రోజు ఆ నియోజకవర్గానికి వైసీపీ కొత్త ఇన్ చార్జ్ ని ప్రకటించింది, రెండ్రోజుల తర్వాత ఆయనకున్న సెక్యూరిటీని తగ్గించింది. తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. రెండురోజుల తర్వాత రూరల్ వైసీపీకి ఎంపీ ఆదాలను కొత్త ఇన్ చార్జ్ గా ప్రకటించారు, ఇప్పుడు ఎమ్మెల్యే కోటంరెడ్డి సెక్యూరిటీ కూడా తగ్గించారు. పైగా ఎమ్మెల్యేకి ఇటీవల బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయంటున్నారు. ఇలాంటి దశలో ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ తగ్గిస్తే ఎలా, ఇలాంటి చర్యల ద్వారా ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తోంది..? సొంత పార్టీ నేతలయినా, ఎమ్మెల్యేలయినా తమకు జై కొడితేనే సెక్యూరిటీ, లేకపోతే వారి కష్టాలు వారివి.. అనుకోవాల్సిందేనా. ఎమ్మెల్యేల విషయంలోనే ఇంత పక్షపాతమా..? అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.

గడప గడపకు వెళ్తేనే..

వాస్తవానికి ఏ ఎమ్మెల్యేకయినా 1 ప్లస్ 1 సెక్యూరిటీ కల్పిస్తామని, కానీ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లే క్రమంలో ఎమ్మెల్యేలు కోరడంతోనే వారికి 2 ప్లస్ 2 భద్రత కల్పించామంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ఇప్పుడు అదనంగా కల్పించిన భద్రతను తొలగించామని మాత్రమే చెబుతున్నారు. అయితే గడప గడపకు ఇకపై తాను వెళ్లడం లేదని ఎమ్మెల్యే పోలీసులకు చెప్పలేదు. అలాంటప్పుడు భద్రత ఎలా తొలగిస్తారనే ప్రశ్న వినపడుతోంది. గడప గడపకు వెళ్తున్నాను సెక్యూరిటీ కల్పించండి అనే సరికి పోలీసులు సెక్యూరిటీ ఇచ్చారట, మరిప్పుడు ఆయన అడగకుండానే ఎందుకు తొలగించారనేది ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు.

గడప గడపకు వెళ్లేది ఎవరు..?

మొదట్లో ఈ కార్యక్రమానికి గడప గడపకు వైసీపీ అనే పేరు పెట్టారు. అది పార్టీ కార్యక్రమం అవుతుందనే ఉద్దేశంతో గడప గడపకు మన ప్రభుత్వం అని పెట్టారు. మన ప్రభుత్వం అంటే ఎవరు, వైసీపీ ఎమ్మెల్యేలే అనేది ప్రభుత్వం వాదన. అందుకే పార్టీతో సంబంధం తెంపేసుకుంటున్నవారందర్నీ గడప గడపకు వెళ్లొద్దని చెబుతున్నారు అధికారులు.

ఆనంకు కూడా ఇలాగే..

ఆమధ్య ఆనం రామనారాయణ రెడ్డి విషయంలో కూడా పోలీసు సెక్యూరిటీని తగ్గించారు. 1 ప్లస్ 1 కి పరిమితం చేశారు. వెంకటగిరి మావోయిస్ట్ ల ప్రభావం ఉన్న ప్రాంతం, తనకు ప్రాణహాని ఉందని ఎమ్మెల్యే చెబుతున్నా కూడా అధికారులు పట్టించుకోలేదనే వాదన వినపడుతోంది.

అధికారుల అత్యుత్సాహమో, లేక అధిష్టానం ఆదేశమో తెలియదు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వెంటనే ఇలా భద్రత తగ్గించడం విమర్శలకు దారి తీస్తోంది. అనుకోకుండా వారిపై ప్రజల్లో సింపతీ పెరిగేందుకు దోహదపడుతోంది. కక్షసాధింపు అనే మాటకు తావిస్తోంది.

Tags:    
Advertisement

Similar News