అప్పుడు దొంగ ఓట్లతో గెలిచా.. ఇప్పుడు 10కోట్లిస్తానన్నా వద్దన్నా

అప్పట్లో తాను దొంగఓట్లతో గెలిచానంటూ సంతోషంగా చెప్పారు ఎమ్మెల్యే రాపాక. చింతలమోరి గ్రామంలో తన ఇంటి వద్ద ఉన్న పోలింగ్ బూత్‌ లో దొంగ ఓట్లు పడేవని చెప్పారు.

Advertisement
Update:2023-03-27 13:45 IST

జనసేన టికెట్ పై గెలిచి, వైసీపీ జట్టులో చేరిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ ఇటీవల టాక్ ఆఫ్ ది ఏపీగా మారారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ దగ్గర డబ్బులు తీసుకుని ఓట్లు వేశారంటూ వారిని సస్పెండ్ చేసింది అధిష్టానం. అదే సమయంలో తనకు కూడా 10కోట్ల ఆఫర్ వచ్చిందని, కానీ తాను దానిని కాలదన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాపాక వరప్రసాద్. తనకు సిగ్గు, శరం ఉందని.. అందుకే అమ్ముడు పోలేదన్నారు. ఈ సంచలనానికి తోడు, ఆయన ఓ ఆత్మీయ సమ్మేళనంలో నోరుజారి చేసిన వ్యాఖ్యలు మంరింత వైరల్ గా మారాయి. దొంగఓట్ల ఎమ్మెల్యే అంటూ ఇప్పుడు రాపాక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.

గతంలో చేసిన ఘనకార్యం..

రాపాక వరప్రసాద్ గతంలో చింతలమోరి గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. అప్పట్లో ఆయన ఎలా గెలిచాడనే విషయాన్ని ఇటీవల అంతర్వేదిలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సోదాహరణంగా వివరించారు. అప్పట్లో తాను దొంగఓట్లతో గెలిచానంటూ సంతోషంగా చెప్పారు ఎమ్మెల్యే రాపాక. చింతలమోరి గ్రామంలో తన ఇంటి వద్ద ఉన్న పోలింగ్ బూత్‌ లో దొంగ ఓట్లు పడేవని చెప్పారు. తన అనుచరులు ఒక్కొకరు 10, 15ఓట్లు వేసేవారని గుర్తు చేసుకున్నారు. వారి దొంగ ఓట్ల వల్లే తనకు భారీ మెజార్టీ వచ్చిందని చెప్పారు. అప్పుడు తనకు సహాయం చేసిన అనుచరులను ఇప్పుడు గుర్తు చేసుకున్నారు రాపాక.

ఆయన సగర్వంగా చెప్పుకున్నా, ఇప్పుడా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అప్పట్లో దొంగఓట్లను దర్జాగా స్వీకరించిన ఎమ్మెల్యే రాపాక, ఇప్పుడు టీడీపీ తనకు 10కోట్లు ఆఫర్ చేసిందని చెప్పుకోవడం సిగ్గుచేటని అంటున్నారు నెటిజన్లు. జనసేన టికెట్ పై గెలిచిన ఆయన వైసీపీలోకి వెళ్లాక, జనసైనికులు సోషల్ మీడియాలో బాగానే టార్గెట్ చేశారు. తాజాగా మరోసారి జనసైనికులు సోషల్ మీడియాలో ఆయన్ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. దొంగఓట్ల రాపాక అంటూ కామెంట్లు పెడుతున్నారు. టీడీపీపై ఆయన చేసిన ఆరోపణలు వైరల్ అవుతున్న సమయంలో ఎవరో కావాలనే ఈ దొంగఓట్ల మేటర్ ని కూడా లీక్ చేశారని కూడా అంటున్నారు. ఎవరు వైరల్ చేసినా, ఆయన స్వయంగా తాను దొంగఓట్లతో గెలిచానని చెప్పుకోవడం మాత్రం సంచలనంగా మారింది.

Tags:    
Advertisement

Similar News