పిన్నెల్లికి షరతులు వర్తిస్తాయి..
ఎన్నికల్లో విజయం సాధించినా కూడా పిన్నెల్లి ఆ విజయోత్సవాల్లో పాల్గొనే అవకాశం ఉండదు, మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉండదు.
ఏపీ రాజకీయాల్లో పల్నాడు, పిన్నెల్ని అనే రెండు పేర్లు హాట్ టాపిక్స్ గా ఉన్నాయి. పల్నాడు అల్లర్లను పిన్నెల్లి ఖాతాలో వేయాలని టీడీపీ, ఎల్లో మీడియా విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో కొంతవరకు విజయం సాధించాయి కూడా. అయితే ఈవీఎం పగలగొట్టిన వీడియో వ్యవహారం ఇప్పుడు టీడీపీ మెడకు చుట్టుకునేలా ఉంది. ఈ కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చేయొద్దంటూ ఉత్తర్వులిచ్చిన హైకోర్టు.. తాజాగా మరిన్ని షరతులు విధించింది.
మాచర్ల నుంచి అదృశ్యమైన తర్వాత పిన్నెల్లి, మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలిచ్చారు. ఇకపై ఆయన అలా మీడియాతో మాట్లాడటానికి అవకాశం లేదని తేల్చి చెప్పింది హైకోర్టు. ఆయన నియోజకవర్గ కేంద్రంలోనే ఉండాలని సూచించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడవద్దని చెప్పింది. సాక్షులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయకూడదని షరతు విధించింది. పిన్నెల్లిపై పూర్తి స్థాయిలో నిఘా విధించాలని, ఎన్నికల ప్రధాన అధికారి, పోలీస్ అధికారులకు కూడా హైకోర్టు ఆదేశాలిచ్చింది.
కౌంటింగ్ రోజున..
ఇక కౌంటింగ్ రోజున పిన్నెల్లిని మాచర్లకు వెళ్లొద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది. అంటే ఎన్నికల్లో విజయం సాధించినా కూడా ఆయన ఆ విజయోత్సవాల్లో పాల్గొనే అవకాశం ఉండదు, మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉండదు. జూన్-4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలవుతుండగా, పిన్నెల్లిపై విధించిన ఆంక్షలు మాత్రం జూన్-6 వరకు అమలులో ఉంటాయి.