కోటంరెడ్డి కొత్త ఉద్యమం.. ఈసారి లాజిక్‌తో కొట్టాడు..

బారా షహీద్ దర్గాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు నిధులు కేటాయిస్తూ జీవో విడుదల చేసినా.. ఇంకా డబ్బు ఎందుకు రాలేదంటూ కోటంరెడ్డి నిల‌దీశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ సంతకానికి కూడా విలువ లేదా? అంటూ ప్రశ్నించారు. ఈ విషయంపై తాను పెద్ద ఉద్యమం నిర్మిస్తానని చెప్పారు.

Advertisement
Update:2023-04-08 14:43 IST

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇటు ప్రభుత్వానికి.. అటు వైసీపీకి తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూనే ఉన్నారు. ప్రతిపక్ష నేతలు కూడా ఈ స్థాయిలో అధికార పార్టీపై విమర్శలు గుప్పించి ఉండరు.. కోటంరెడ్డి వ్యవహారంతో ఓ దశలో అధికార పార్టీ పెద్దలు విసుగు చెందారు. ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో సైతం కోటంరెడ్డి అసెంబ్లీలో రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో బయటికొచ్చిన కోటంరెడ్డి.. ఆ తర్వాత వరుసగా బాంబులు పేలుస్తూనే ఉన్నాడు.

వైసీపీ నుంచి కోటంరెడ్డితోపాటు మేకపాటి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణరెడ్డి బయటకు వెళ్లినప్పటికీ.. వారందరి కంటే కోటంరెడ్డే.. ఎక్కువ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కోటంరెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. బారా షహీద్ దర్గాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు నిధులు కేటాయిస్తూ జీవో విడుదల చేసినా.. ఇంకా డబ్బు ఎందుకు రాలేదంటూ నిల‌దీశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ సంతకానికి కూడా విలువ లేదా? అంటూ ప్రశ్నించారు. ఈ విషయంపై తాను పెద్ద ఉద్యమం నిర్మిస్తానని చెప్పారు.

మైనార్టీలను, మైనార్టీ మత పెద్దలను కలుసుకొని ఉద్యమం చేపడతానని.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, మైనార్టీల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తానని చెప్పారు. ప్రస్తుతం కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. మరి ఆయన ఆరోపణలను ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతోందో చూడాలి.

కోటంరెడ్డి మీద నేరుగా మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్దగా విమర్శలు చేయడం లేదు. విమర్శలు గుప్పిస్తే.. ఆయన హీరోగా మారతారేమోనని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. రెబల్ ఎమ్మెల్యేల తీరుతో వైసీపీ అధిష్ఠానం ఇబ్బందులు ఎదుర్కొంటున్నది మాత్రం వాస్తవం. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు.. ప్రభుత్వంపై నిరసన గళం వినిపించి సస్పెండ్ అయ్యారు. అయితే పార్టీలో ఉన్న కొందరు ఎమ్మెల్యేల్లో సైతం అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. వారిని వైసీపీ హైకమాండ్ ఎలా బుజ్జగిస్తుందో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News