పవన్ కి పెద్ద టాస్క్ ఇచ్చిన భీమవరం ఎమ్మెల్యే
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తే.. పవన్ టీడీపీతో సహజీవనం చేస్తున్నారని విమర్శించారు. చిరంజీవి ఎవరినీ మోసం చేయలేదని, కానీ పవన్ అడుగడుగునా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్.
భీమవరంలో ఈరోజు సాయంత్రం పవన్ కల్యాణ్ సభ జరగాల్సి ఉంది. ఈ సభలో చెప్పాల్సిన విషయాలను ఇప్పటికే పవన్ ప్రిపేర్ చేసుకుని ఉంటారు. ఇటీవల అమ్మఒడి సభలో సీఎం జగన్ విమర్శలతో పవన్ ప్రిపరేషన్ కాస్త మారి ఉంటుంది. జగన్ కి కౌంటర్లు రెడీ చేసుకుని ఉంటారు పవన్. తాజాగా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, పవన్ కి పెద్ద టాస్క్ ఇచ్చారు. పవన్ పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు.
చెప్పుల ప్రస్తావన..
ఇప్పటికే పవన్ కల్యాణ్, వైసీపీ నాయకుల మధ్య చెప్పుల విమర్శలు శృతి మించాయి. మా చెప్పులు పోయాయంటే, మావి పోయాయని ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకున్నారు. తాజాగా ఎమ్మెల్యే గ్రంథి ఆ పోయిన చెప్పులకు సరికొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబు ఇంటికి ప్యాకేజీ తీసుకోడానికి వెళ్లిన పవన్, గుమ్మం ముందు చెప్పులు విడిచి లోపలికి వెళ్లారని, ప్యాకేజీ తీసుకుని దొడ్డిదారిన చెప్పులు లేకుండానే వెళ్లిపోయారని వెటకారం చేశారు. చంద్రబాబు ఇంటి వద్ద వెదికితే పవన్ చెప్పులు దొరుకుతాయన్నారు.
పవన్ ని ఎల్కేజీలో చేర్పిస్తాం..
జనసేన సంచార వయోజన విద్యాకేంద్రంలో సీఎం జగన్ కి తెలుగు భాష నేర్పిస్తానన్న పవన్ వ్యాఖ్యలకు గ్రంథి కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ని ఎల్కేజీలో చేర్పిస్తామని, దానికి వయసు నిబంధన సడలిస్తూ జీవో ఇవ్వాలని తాను సీఎం జగన్ ని అభ్యర్థిస్తానన్నారు.
పార్టీలు పెరిగితే ప్రజాస్వామ్యానికి మంచిదని, కానీ పార్టీని ప్యాకేజీ కోసం అమ్మేయడం సరికాదని అన్నారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తే.. తమ్ముడు పవన్ టీడీపీతో సహజీవనం చేస్తున్నారని విమర్శించారు. చిరంజీవి ఎవరినీ మోసం చేయలేదని, కానీ పవన్ అడుగడుగునా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
యువతకు ఇచ్చే సందేశం ఇదేనా..?
గుడ్డలు ఊడదీసి కొడతానంటున్న పవన్.. ఎవర్ని కొడతారో స్పష్టం చేయాలన్నారు. వైసీపీకి ఓటు వేసిన వారినా..? లేక చంద్రబాబు, పవన్ ని ఓడించిన ప్రజలనా..? అని నిలదీశారు ఎమ్మెల్యే గ్రంథి. పీక పిసికేయండి, మక్కెలు విరగ్గొట్టండి అంటూ యువతకు పవన్ రౌడీయిజం నేర్పిస్తున్నారని, యువతను రెచ్చగొట్టి వారి జీవితాలు నాశనం చేయకండి అని సూచించారు పవన్. యువతకు ఎప్పుడైనా పవన్ మంచి సలహా ఇచ్చారా అని ప్రశ్నించారు. జ్వరం అనే సాకు చెప్పి వారాహి యాత్రని మధ్యలో ఆపేసి, సినిమాలకి డబ్బింగ్ పూర్తి చేసి మరోసారి అభిమానులను పవన్ మోసం చేశారని ఆరోపించారు గ్రంథి శ్రీనివాస్. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కూడా పవన్ సాయంత్రం సభలో స్పందించే అవకాశముంది.