లోకేష్ ట్రాప్ లో ఎమ్మెల్యే అనిల్

ఒట్టు పెట్టినంత మాత్రాన అనిల్ పై పడిన మరక తొలగిపోదు. ఒకరకంగా అనిల్ ని పక్కా ప్లాన్ తో లాక్ చేశారు లోకేష్. ఆ ట్రాప్ లో పడి ప్రెస్ మీట్లు, ప్రమాణాలు అంటూ నానా కంగాళీ అయిపోయారు అనిల్.

Advertisement
Update:2023-07-07 11:28 IST

యువగళం పాదయాత్రలో నారా లోకేష్ స్థానిక వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు. తాను ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లా నాయకులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకులిచ్చిన సమాచారం ప్రకారం వారిపై ఆరోపణలు చేస్తున్నారు. అక్రమాస్తులు, అక్రమ వ్యాపారాలంటూ గుడ్డకాల్చి మొహంపై వేస్తున్నారు. అయితే కొంతమంది లోకేష్ ఆరోపణలు లైట్ తీసుకుంటున్నారు, మరికొందరు సీరియస్ గా తీసుకుని ఆ అపవాదు తొలగగించుకునే ప్రయత్నంలో ఆ మసి మొహానికి పూసుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి అలాగే తయారైంది. తాజాగా ఆయన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి ప్రమాణం చేసి వచ్చారు.

అనిల్ కి వెయ్యి కోట్ల రూపాయల అక్రమాస్తులున్నాయనేది లోకేష్ ఆరోపణ. దానికి తగ్గట్టు ఏవేవో ఆధారాలు చూపించారాయన. వాటిని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఓ రేంజ్ లో హైలెట్ చేసింది. ఇంకేముంది అనిల్ హడావిడి పడిపోయారు. నాకు ఆస్తులు లేవన్నారు, నమ్మకపోతే వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రమాణం చేస్తానన్నారు. దమ్ముంటే నువ్వుకూడా రా అంటూ లోకేష్ కి సవాల్ విసిరారు. ఇవన్నీ ఎందుకు నెల్లూరులో తనపై పోటీ చేసి గెలువు అంటూ మరో సవాల్ కూడా విసిరారు. ఇలా అందరి సవాళ్లకు స్పందిస్తూ పోతే లోకేష్ కి టైమ్ సరిపోతుందా.. అందుకే బురదజల్లడం వెళ్లిపోవడం పనిగా పెట్టుకున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యే అనిల్ పై వీలైనంత ఎక్కువగా బురదజల్లి వెళ్లిపోయారు. దాన్ని కడుక్కునే పనిలో పడ్డారు అనిల్.


జిల్లాలో అనిల్ కి రెండు రకాల సమస్యలున్నాయి. ఓవైపు లోకేష్ యాత్రలో ప్రతి రోజూ ఆయనపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు సొంత నియోజకవర్గంలో సొంత మనుషులే ఆయనకు శత్రువులయ్యారు. జిల్లాలో ఏ ఒక్క నాయకుడు కూడా అనిల్ కి మద్దతుగా రాలేదు, లోకేష్ విమర్శలు అవాస్తవాలని చెప్పలేదు. దీంతో అనిల్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇటు సొంత పార్టీ నేతల్ని ఎదుర్కోవడం, అటు వైరి వర్గాల విమర్శలకు కాచుకోవడం.. ఇలా అనిల్ ఆందోళనలో పడిపోయారు. వచ్చే ఎన్నికల్లో అనిల్ కి వైసీపీ టికెట్ రాదు అనే ప్రచారం కూడా ఆయన ఆందోళనకు మరో కారణం. తనదే టికెట్ అని ధైర్యంగా చెప్పుకుంటున్నా.. లోకల్ పాలిటిక్స్ ఆయనను టెన్షన్ పెడుతున్నాయి. మరోవైపు నారాయణకు టీడీపీ టికెట్ ఖాయం చేసింది.


ఈ దశలో అనిల్ వ్యతిరేక వర్గం నారాయణకు లోపాయికారీగా సహాయం చేసే అవకాశముంది. అది పూర్తిస్థాయిలో జరిగితే అనిల్ ఓటమి ఖాయం. టికెట్ వస్తుందా లేదా అనేది కూడా చివరి నిమిషం వరకు తేలేలా లేదు. అందుకే ఆయన ఆందోళనగా కనపడుతున్నారు. తాజాగా లోకేష్ ఆరోపణలకు అనిల్ కాస్త ఎక్కువగా స్పందించారేమో అనిపిస్తోంది. నేరుగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి ఒట్టు పెట్టారు అనిల్.


రాజకీయ నాయకుల ప్రమాణాల గురించి జనాలకు బాగా తెలుసు. ఒట్టు పెట్టినంత మాత్రాన అనిల్ పై పడిన మరక తొలగిపోదు. ఒకరకంగా అనిల్ ని పక్కా ప్లాన్ తో లాక్ చేశారు లోకేష్. ఆ ట్రాప్ లో పడి ప్రెస్ మీట్లు, ప్రమాణాలు అంటూ నానా కంగాళీ అయిపోయారు అనిల్. 

Tags:    
Advertisement

Similar News