మద్దతుదారులతో ఆనం కీలక భేటీ?
మద్దతుదారులంతా కచ్చితంగా సమావేశానికి రావాలని ఆనం నుండి సమాచారం వెళ్ళిందట. దాంతో ఈ భేటీలో పార్టీ మారే విషయంపై నిర్ణయం తీసుకోవచ్చనే ప్రచారం జిల్లాలో పెరిగిపోతోంది.
సీనియర్ నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తొందరలోనే పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా? జిల్లాలోని పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. చాలాకాలంగా ప్రభుత్వంపై ఆనం తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. జిల్లాలోనే అత్యంత సీనియర్ అయిన తనకు జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇస్తారని ఆనం ఆశించారు. అలా జరగకపోవటమే కాకుండా తనకన్నా ఎంతో జూనియర్ అయిన అనీల్ కుమాయర్ యాదవ్‌కు మంత్రివర్గంలో చోటు దక్కింది.
అప్పటి నుంచి ఆనంలో అసంతృప్తి మొదలైంది. చివరకు విస్తరణలో కూడా ఆశించింది దక్కకపోవటంతో ఇక తనకు మంత్రి పదవి రాదని డిసైడ్ అయిపోయారు. అప్పటి నుంచి ఏదో రూపంలో ప్రభుత్వంపై బహిరంగంగా బురదచల్లేస్తున్నారు. పార్టీ మారే ఉద్దేశంతోనే ఆనం బురదచల్లుతున్నారని నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం ఆయనకు ప్రత్యామ్నాయంగా నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డిని ప్రోత్సహిస్తోంది. దీంతో ఆనం మరింతగా మండిపోతున్నారు.
ఇక ప్రస్తుత విషయానికి వస్తే మంగళవారం నెల్లూరు, ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లోని తన మద్దతుదారులతో ఆనం సమావేశం ఏర్పాటు చేశారని సమాచారం. మద్దతుదారులంతా కచ్చితంగా సమావేశానికి రావాలని ఆనం నుండి సమాచారం వెళ్ళిందట. దాంతో ఈ భేటీలో పార్టీ మారే విషయంపై నిర్ణయం తీసుకోవచ్చనే ప్రచారం జిల్లాలో పెరిగిపోతోంది. అయితే ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైగా సమయం ఉండగా ఇప్పుడే పార్టీ మారుతారా అనే సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి.
ఏదేమైనా గౌరవంలేని పార్టీలో కంటిన్యూ అవటం వల్ల ఉపయోగంలేదని ఆనం ఇప్పటికే నిర్ణయించుకున్నారు. అందుకనే పార్టీ మారే విషయమై చర్చించేందుకే మద్దతుదారులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు బాగా ప్రచారం జరుగుతోంది. పార్టీపైనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆనం దారిలోనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి కూడా ఉన్నారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే కోటంరెడ్డి కూడా ఆనం దారిలోనే నడుస్తున్నారు కాబట్టి. మరి జిల్లాలో పరిణామాలు ఎలా మారబోతున్నాయో చూడాల్సిందే.