టికెట్ రాదని తేలిపోయిందా..? వైసీపీ ఎమ్మెల్యే నర్మగర్భ వ్యాఖ్యలు
నిన్న ఎమ్మెల్యేలతో జగన్ పెట్టిన రివ్యూ మీటింగ్ కి కూడా డుమ్మా కొట్టారు. ఇదంతా చూస్తుంటే 2024లో ఆర్కేకు టికెట్ లేదనే ఊహాగానాలు బలపడ్డాయి. వాటికి బలం చేకూర్చేలా ఆయన మాటలు ఉన్నాయి.
"నాకు అందరూ కావాలి, ఏ ఒక్కరినీ వదులుకోవాలనే ఉద్దేశం నాకు లేదు, ఎమ్మెల్యేలే కాదు, కార్యకర్తలు కూడా నాకు ముఖ్యమే." ఎమ్మెల్యేల రివ్యూ మీటింగ్ లో సీఎం జగన్ చెప్పిన మాటలివి. వదులుకోను అంటూనే ఆల్రడీ నలుగుర్ని పక్కనపెట్టారు. మరికొందరికి కూడా 2024లో టికెట్లు ఇవ్వలేననే సంకేతాలు పంపిస్తున్నారు. ఈ దశలో వైసీపీ నేతల వ్యాఖ్యలు ఇప్పుడు నానార్థాలకు దారి తీస్తున్నాయి. ఫ్లోలో అనేస్తున్నారో లేక భవిష్యత్తు తెలిసి ఉద్దేశ పూర్వకంగా అంటున్నారో తెలియదు కానీ.. వైసీపీ ఎమ్మెల్యేలలో కొంతమంద నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా అలాంటి వ్యాఖ్యలతో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.
మంగళగిరిలో నారా లోకేష్ ని ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి తొలి మంత్రివర్గంలోనే చోటు ఉంటుందని అనుకున్నారంతా, లేకపోయే సరికి ఏదో ఒక ప్రాధాన్య పదవి అయినా దక్కుతుందనుకున్నారు. కానీ అదీ లేదు. చివరకు ఆయనకు మంగళగిరి టికెట్ కూడా రాదేమోననే అనుమానం బలపడుతోంది. ఆయన కూడా ఎక్కువగా వ్యవసాయ పనులతో బిజీగా ఉంటున్నారు. దీనికితోడు నిన్న ఎమ్మెల్యేలతో జగన్ పెట్టిన రివ్యూ మీటింగ్ కి కూడా డుమ్మా కొట్టారు. ఇదంతా చూస్తుంటే 2024లో ఆర్కేకు టికెట్ లేదనే ఊహాగానాలు బలపడ్డాయి. వాటికి బలం చేకూర్చేలా ఆయన మాటలు ఉన్నాయి.
తన ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో పాటు, తనకు అనారోగ్యంగా ఉందని, అందుకే సమావేశానికి వెళ్లలేదని చెబుతున్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. 99 శాతం ఎమ్మెల్యేలు హాజరై ఒకరో ఇద్దరో రాకపోతే దాన్ని మీడియా హైలెట్ చేయడం బాధాకరం అని చెప్పారు. తాను మంగళగిరిలో పోటీ చేసినా, చేయకపోయినా వైసీపీ విజయం సాధించడం ఖాయం అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు ఆర్కే. రాజకీయాలలో ఉంటే జగన్ తోనే ఉంటానన్నారు. లేకపోతే పొలంపనులు చేసుకుంటానన్నారు. అయితే పార్టీ మారే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. తాను పోటీ చేసినా, చేయకపోయినా మంగళగిరిలో వైసీపీదే విజయం అంటూ ఆర్కే చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయనకు కూడా టికెట్ రాదనే విషయం తెలిసిపోయిందా అనే గుసగుసలు మొదలయ్యాయి.