బీజేపీలో చేరిక వార్తలపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రియాక్షన్

ఈరోజు మిథున్ రెడ్డి స్వయంగా ఆ ప్రచారాన్ని తప్పుబట్టారు. తనకు అంత ఖర్మ పట్టలేదన్నారు.

Advertisement
Update:2024-06-24 13:04 IST

బీజేపీలో చేరాల్సిన ఖర్మ తనకు పట్టలేదన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా తాను పార్లమెంట్ లో ఏపీ తరపున మాట్లాడతానన్నారు. పార్లమెంట్ లో నేడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఆయన.. పార్టీ మార్పు వార్తలపై ఘాటుగా స్పందించారు. హ్యాట్రిక్ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు మిథున్ రెడ్డి.

ఎంపీగా మిథున్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయనపై పుకార్లు షికార్లు చేశాయి. మిథున్ రెడ్డి బీజేపీ అధిష్టానంతో టచ్ లో ఉన్నారని ఆ పార్టీ నేతలు మీడియాకు లీకులిచ్చారు. ఆయనతోపాటు ఆయన తండ్రి పెద్ది రెడ్డిని కూడా బీజేపీలో చేర్చేందుకు మిథున్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ ప్రచారాన్ని వైసీపీ ఖండించింది. ఈరోజు మిథున్ రెడ్డి స్వయంగా ఆ ప్రచారాన్ని తప్పుబట్టారు. తనకు అంత ఖర్మ పట్టలేదన్నారాయన.

వైసీపీ తరపున లోక్ సభకు ఎన్నికైన ఎంపీలకు మిథున్ రెడ్డి నాయకత్వం వహిస్తారు. జాతీయ, రాష్ట్ర ప్రయోజనాలు ఉండే బిల్లులకు వైసీపీ మద్దతిస్తుందని తెలిపారాయన. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండేవాటిని వ్యతిరేకిస్తామన్నారు. గతంలో కూడా తాను పార్టీ మారతానంటూ ఇలాగే తప్పుడు ప్రచారం జరిగిందని, ఇప్పుడు కూడా అలాంటి ప్రచారమే మొదలు పెట్టారని మండిపడ్డారు. జగన్ తనను సొంత తమ్ముడిలా భావిస్తారని చెప్పుకొచ్చారు మిథున్ రెడ్డి. జగన్ తోనే ఉంటూ, పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News