చంద్రబాబుని తిట్టేందుకు మరోసారి తిరుమల యాత్ర..

తాజా ఎపిసోడ్ లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరికీ కలిపి చాకిరేవు పెట్టారు మంత్రి రోజా. కళ్లున్న కబోది చంద్రబాబు అని విమర్శించారు.

Advertisement
Update:2022-11-05 21:12 IST

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన మంత్రి రోజా.. దర్శనం అనంతరం యధావిధిగా చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇటీవల కాలంలో అటు శ్రీవారికి స్తోత్రం, ఇటు వైరి వర్గాలపై తిట్ల పురాణం.. ఈ రెండూ యధావిధిగా కొనసాగిస్తున్నారామె. తాజా ఎపిసోడ్ లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరికీ కలిపి చాకిరేవు పెట్టారు. కళ్లున్న కబోది చంద్రబాబు అని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే చంద్రబాబు, పవన్ అడ్డుకుంటున్నారని.. అదే సమయంలో అభివృద్ధి జరగడంలేదని వారే విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

రోడ్లు వేస్తుంటే అడ్డుకుంటారా..?

ఏపీలో రోడ్లు వేస్తుంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు మంత్రి రోజా. ఇప్పటంలో ఆక్రమణల తొలగింపుని అడ్డుకోవాలనుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు దర్శకత్వంలో పవన్ నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. పవన్ ఏం ఉద్ధరించడానికి ఇప్పటం వెళ్లారని ప్రశ్నించారు. ఆరు నెలల ముందే అక్కడ ఆక్రమణలు తొలగిస్తామంటూ ప్రభుత్వం నోటీసులిచ్చిందని, తీరా ఇప్పుడు తొలగిస్తుంటే పవన్ రాద్ధాం చేస్తున్నారని విమర్శించారు రోజా.


చర్చకు సిద్ధంగా ఉన్నాం..

ఐదేళ్లలో చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటో, మూడున్నరేళ్లలో జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, తమ సవాల్ ని బాబు కానీ, పవన్ కానీ స్వీకరిస్తారా అని ప్రశ్నించారు మంత్రి రోజా. శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకే పవన్ హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తున్నారని, ఆయన సీజనల్ పొలిటీషియన్ అని సెటైర్లు వేశారు మంత్రి రోజా.

Tags:    
Advertisement

Similar News