చంద్రబాబు సైకో, లోకేష్ ఐరన్ లెగ్.. - రోజా
లోకేష్ మొదటిసారి గోదావరి పుష్కరాలకు వెళ్లిన సమయంలో 29 మంది చనిపోయారని, ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశాడో లేదో వాళ్ల నాన్నకు ఓటుకు నోటు కేసులో నోటీసులు అందాయన్నారు.
చంద్రబాబు సైకో.. నారా లోకేష్ ఐరన్ లెగ్ అని మంత్రి రోజా సెటైర్లు వేశారు. శనివారం విశాఖ శారదాపీఠం వార్షికోత్సవంలో మంత్రి రోజా పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. లోకేష్ ది ఐరన్ లెగ్ అని, ఆయన రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తే పరిస్థితి ఏంటని ప్రజలు భయపడుతున్నారన్నారు. లోకేష్ మొదటిసారి గోదావరి పుష్కరాలకు వెళ్లిన సమయంలో 29 మంది చనిపోయారని, ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశాడో లేదో వాళ్ల నాన్నకు ఓటుకు నోటు కేసులో నోటీసులు అందాయన్నారు.
ఇటీవల లోకేష్ పాదయాత్రకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరించాడని, ఆ సమయంలో కందుకూరులో 8 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయారన్నారు. నిన్న లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించారో లేదో తారకరత్నకు గుండెపోటు వచ్చిందని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. తారకరత్నకు గుండెపోటు వచ్చి అస్వస్థతకు గురైతే చంద్రబాబు, లోకేష్ పట్టించుకోలేదని రోజా ఆరోపించారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు.
పాదయాత్రలో లోకేష్ ఉపన్యాసాలు ఇవ్వడంలో తడబడుతున్నారని, అతడు లోకేష్ కాదు.. పులకేషు అని రోజా ఎద్దేవా చేశారు. మహిళలను కించే పరుస్తూ మాట్లాడే చంద్రబాబు, లోకేష్ లకు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే మహిళలకు భద్రత పెరిగిందని చెప్పారు. అధికారం కోసమే చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ రోడ్డెక్కారని మంత్రి రోజా విమర్శించారు.