ఫేక్ వార్తలతో దుష్ప్రచారం చేయొద్దు.. నాగబాబుకు రోజా కౌంటర్

వ్యక్తిగతంగా తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, పార్టీ పరంగా, సిద్ధాంత పరంగానే తన విమర్శలు ఉంటాయని మంత్రి రోజా చెప్పారు. మహిళలను గౌరవించడం ఎలాగో ముందు నాగబాబు తెలుసుకోవాలని సూచించారు.

Advertisement
Update:2023-01-07 20:42 IST

విమర్శలు చేసేటప్పుడు విషయం ఉంటే చేయాలి తప్ప ఫేక్ వార్తలతో దుష్ప్రచారం చేయడం తగదని ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా జనసేన నేత నాగబాబుకు కౌంటర్ ఇచ్చారు. ఇటీవల మంత్రి రోజా చిరంజీవి, ఆయన సోదరులపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. సొంత జిల్లా అభివృద్ధి గురించి పట్టించుకోకపోవడం వల్లే ఎన్నికల్లో పోటీ చేసిన మెగా సోదరులు ముగ్గురిని ప్రజలు ఓడించారని ఆమె విమర్శించారు. రోజా చేసిన కామెంట్స్ పై నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజాది నోరు కాదు.. మున్సిపాలిటీ తొట్టె అని..మండిపడ్డారు.

టాప్ 20 ర్యాంకింగ్స్ లో దేశంలో ఏపీ పర్యాటక శాఖ 18వ స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. పర్యాటక శాఖ మంత్రి అంటే నువ్వు పర్యటనలు చేయడం కాదని, పర్యాటకశాఖని ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించాలని మంత్రి రోజాకు సూచించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

కాగా, నాగబాబు చేసిన విమర్శలపై తాజాగా మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. ఫేక్ వార్తలతో తనపై దుష్ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. టూరిజంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానంలో ఉన్నట్లు తెలిపారు. చిరంజీవి కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాష్ట్రానికి ఏం చేశారని తానేప్పుడూ ప్రశ్నించలేదన్నారు. చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు కాబట్టి ఆ విషయం గురించి తాను మాట్లాడనని తెలిపారు. వ్యక్తిగతంగా తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, పార్టీ పరంగా, సిద్ధాంత పరంగానే తన విమర్శలు ఉంటాయని చెప్పారు. మహిళలను గౌరవించడం ఎలాగో ముందు నాగబాబు తెలుసుకోవాలని మంత్రి రోజా సూచించారు.

Tags:    
Advertisement

Similar News