పెళ్లి చేసుకోవడానికైతే వైజాగ్ అమ్మాయి కావాలి.. రాజధానిగా వైజాగ్ వద్దా? : మంత్రి రోజా
విశాఖపట్నం ప్రజలు చాలా తెలివైన వాళ్లు. అందులో గాజువాక వాళ్లు విజ్ఞులు, విజన్ ఉన్న వాళ్లు. పవన్ కల్యాణ్ గురించి ముందే తెలుసు కాబట్టే చిత్తుగా ఓడించి ఇంటికి పంపించారు.
ఏపీ పాలనా వికేంద్రీకరణపై అధికార వైసీపీ, ప్రతిపక్షాల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. ఒకవైపు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తున్నారు. బీజేపీ, టీడీపీ కూడా అమరావతే ప్రజల రాజధాని అని చెబుతూ వస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా విశాఖకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఈ క్రమంలో శనివారం విశాఖపట్నంలో 'విశాఖ గర్జన' పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది ప్రజలు, ప్రజా సంఘాలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మల్సీలు, మంత్రలు, జేఏసీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కల్యాణ్ విశాఖపట్నాన్ని, వికేంద్రీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలియడం లేదని అన్నారు. పవన్ పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ అమ్మాయి కావాలి.. షూటింగ్స్ చేసుకోవడానికి వైజాగ్ కావాలి.. సినిమా కలెక్షన్ల కోసం విశాఖపట్నం కావాలి.. నటన నేర్చుకోవడానికి వైజాగ్ కావాలి.. ఆయన పోటీ చేయడానికి కూడా విశాఖపట్నం (గాజువాక) కావాలి. కానీ, అదే విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాటవుతుంటే మాత్రం పవన్ కల్యాణ్‌ను నచ్చడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని రోజా పిలుపునిచ్చారు.
విశాఖపట్నం ప్రజలు చాలా తెలివైన వాళ్లు. అందులో గాజువాక వాళ్లు విజ్ఞులు, విజన్ ఉన్న వాళ్లు. పవన్ కల్యాణ్ గురించి ముందే తెలుసు కాబట్టే చిత్తుగా ఓడించి ఇంటికి పంపించారు. నాగిరెడ్డి చేతిలో ఓడిపోయిన పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తున్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్రలో రాజధాని రాకుండా అడ్డుకుంటున్నారు. ఇక్కడ ఎందుకు రాజధాని పెట్టకూడదో పవన్ కల్యాణ్ చెప్పాలని రోజా ధ్వజమెత్తారు. రాజధాని రాకుండా అడ్డుకుంటున్న పవన్ కల్యాణ్‌కు ఉత్తరాంధ్ర ప్రజలు తొడగొట్టి చూపించాలని పిలుపునిచ్చారు. ఎవరూ ఎన్ని కుట్రలు చేసి ఆపినా విశాఖకు పరిపాలనా రాజధాని రావడం మాత్రం పక్కా అని ఆమె అన్నారు.