మేం పిచ్చికుక్కలైతే.. మీరు గజ్జి కుక్కలు..

మూడు రాజధానులకు మద్దతు తెలిపేవారిని టీడీపీ నేతలు పిచ్చి కుక్కలు అంటున్నారని, వికేంద్రీకరణను అడ్డుకుంటున్న అచ్చెన్నాయుడు వంటివారే గజ్జి కుక్కలని మండిపడ్డారు మంత్రి రోజా.

Advertisement
Update:2022-10-15 13:25 IST

విశాఖ గర్జన విమర్శలతో వేడెక్కింది. పిచ్చి కుక్కలు, గజ్జి కుక్కలంటూ రాజకీయ నాయకులు దూషణల పర్వం మొదలుపెట్టారు. మూడు రాజధానులకు మద్దతు తెలిపేవారిని టీడీపీ నేతలు పిచ్చి కుక్కలు అంటున్నారని, వికేంద్రీకరణను అడ్డుకుంటున్న అచ్చెన్నాయుడు వంటివారే గజ్జి కుక్కలని మండిపడ్డారు మంత్రి రోజా. విశాఖ గర్జనకు తరలివస్తున్న ప్రజల్ని చూస్తుంటే.. ఉత్తరాంధ్రకు ఒక రాజధాని కావాలని ఇక్కడి జనాలు బలంగా కోరుకుంటున్నారనే విషయం స్పష్టమవుతోందని అన్నారు రోజా.

కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ప్రతిపక్ష పార్టీలవారు ఆలోచిస్తున్నారని, తాము ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నామని చెప్పారు రోజా. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కోసం సీఎం జగన్ మూడు రాజధానులు తీసుకొస్తే, చంద్రబాబు మాత్రం మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో రాజధాని పెట్టాలని ప్రజాగర్జన సభ నిర్వహిస్తున్న సమయంలోనే, పవన్ ఇక్కడ సభ పెట్టాలని నిర్ణయించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అమరావతే రాజధానిగా ఉండాలని.. పెయిడ్ ఆర్టిస్టులతో పాదయాత్రలు చేయిస్తున్నారని మండిపడ్డారు రోజా. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుంటే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ను ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు.

వాటి కోసం విశాఖ ఓకేనా.. ?

సినిమా షూటింగ్‌లు, సినిమా ఫంక్షన్లు, సినిమా విడుదల, కలెక్షన్ల కోసం విశాఖ కావాలని, అలాంటి విశాఖ రాజధానిగా పనికి రాదా అంటూ పవన్ కల్యాణ్‌ని సూటిగా ప్రశ్నించారు మంత్రి రోజా. గత ఎన్నికల్లో పవన్ విశాఖలోని గాజువాకలో పోటీ చేశారని, పోటీ చేయడానికి పనికొచ్చిన విశాఖ, రాజధానిగా పనికి రాదా అని ప్రశ్నించారు. గతంలో కర్నూలు, వైజాగ్‌లను రాజధానులు అని చెప్పిన పవన్, ఇప్పుడు వెంటనే ప్లేటు తిప్పేసి మాట మార్చేశారని రోజా విమర్శించారు. మూడు రాజధానులు ఉండాలని కోరుతున్న తాము, అమరావతికి అన్యాయం చేయడం లేదని చెప్పారు రోజా.

Tags:    
Advertisement

Similar News