టైమ్ ఇవ్వరా..? సిగ్గులేదా..? మంత్రి నిమ్మల అసహనం
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తల్లికి వందనంపై క్లారిటీ ఇచ్చారు. మాజీ మంత్రులకు సిగ్గులేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అమ్మఒడి వర్సెస్ తల్లికి వందనం. ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల మంటలు చెలరేగాయి. తల్లికి వందనం కాదు, తల్లికి మోసం అంటూ వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టారు. సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమ్మఒడి ఒక బిడ్డకే అయితే, తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకు అంటూ ఊదరగొట్టారని, ఇప్పుడేమైందని నిలదీశారు. ఈ కౌంటర్లకు టీడీపీ నుంచి కూడా ఘాటు రియాక్షన్లు వచ్చాయి. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తల్లికి వందనంపై క్లారిటీ ఇచ్చారు. మాజీ మంత్రులకు సిగ్గులేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తల్లికి వందనం పథకం గురించి ప్రెస్ మీట్ పెట్టిన మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ఎన్నికల ప్రచారంలో నిమ్మల రామానాయుడు మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు. మీకు 15 వేలు, మీకు 15 వేలు.. అంటూ ఆయన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తీరా తల్లికి వందనం గైడ్ లైన్స్ లో ఆ మాటే లేదన్నారు. ఇప్పుడు మంత్రి నిమ్మల ప్రెస్ మీట్ పెట్టారు. 2019 ఎన్నికల ప్రచారంలో జగన్ సతీమణి భారతి రెడ్డి ఇచ్చిన హామీల వీడియోని ప్లే చేశారు. అందులో ఉన్నది జగన్ సతీమణి అవునా కాదా..? అవి ఆమె మాటలు అవునా కాదా..? చెప్పాలన్నారు. ఎన్నికల ముందు హామీలిచ్చి ప్రజల్ని మోసం చేసింది వైసీపీయేనని దుయ్యబట్టారు.
తాము అధికారంలోకి వచ్చి కేవలం నెలరోజులే అవుతోందని, తల్లికి వందనం పథకాన్ని తాము చెప్పినట్టే అమలు చేస్తామని, విధి విధానాలు రూపొందించుకుంటున్నామని చెప్పారు మంత్రి నిమ్మల. అంతలోనే తల్లికి మంగళం అని ఎలా రాస్తారాంటూ నిలదీశారు. ఐదేళ్లపాటు అమ్మఒడి పేరుతో ప్రజల్ని మోసం చేసిన వైసీపీ నేతలకు తమను విమర్శించే అర్హత లేదన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.