పోలవరం అప్ డేట్.. కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాల్సిందే

గత ప్రభుత్వ తప్పిదం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని చెప్పారు మంత్రి నిమ్మల. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన ఖర్చును భరించాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు.

Advertisement
Update:2024-07-05 20:12 IST

పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టడానికి దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రాజెక్ట్ సేఫ్టీ ముఖ్యం కాబట్టి డయాఫ్రమ్ వాల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు చెప్పారాయన. డయాఫ్రమ్ వాల్ కు రిపేర్లు చేయొచ్చనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయని, వాటిని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని చెప్పారు మంత్రి నిమ్మల. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన ఖర్చును భరించాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు.


ఇక పట్టిసీమ పంపుల నుంచి నీటి విడుదల ప్రణాళికాబద్దంగా చేస్తున్నామని చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు. 15 పంపుల నుంచి నీటి విడుదల చేస్తున్నామని, ప్రస్తుతం రెండు పంపుల్లో సమస్య ఉందని తెలిపారు. మరో మూడు నాలుగు రోజుల్లో 21 పంపులు వదులుతామని చెప్పారు. కాల్వగట్లను పటిష్టం చేయబోతున్నామని, గండ్లు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించామని చెప్పారు మంత్రి నిమ్మల. ఇరిగేషన్ సీఈ, ఎస్ఈలతో సమావేశమైన మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు.

పట్టిసీమ జలాల విడుదలపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పైప్ లైన్ లీక్ అవుతోందని వైసీపీ ఆరోపించగా.. అదంతా గత వైసీపీ ప్రభుత్వ పాపాల ఫలితమేనంటూ టీడీపీ ట్వీట్ చేసింది.


ప్రాజెక్ట్ ల విషయంలో మంత్రి నిమ్మల కూడా గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. గత ప్రభుత్వ పాపాలు.. రైతుల పాలిట శాపాలుగా మారాయని మండిపడ్డారాయన. ప్రాజెక్టుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని, ప్రాజెక్టులు, గేట్లు కొట్టుకుపోయిన పరిస్థితి చూశామన్నారు. గత ఐదేళ్లల్లో లాకులకు గ్రీజ్ కూడా పెట్టని దుస్థితి ఉందన్నారు. కాల్వల్లో సిల్ట్ తీయలేదని, తట్ట మట్టి కూడా ఎత్తలేదన్నారు. జగన్ నిర్వాకం వల్ల వేలాది ఎకరాలు మునిగిపోయే ప్రమాదం ఉందని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నిమ్మల. 

Tags:    
Advertisement

Similar News