ఏపీలో మళ్లీ జగనే.. కాంగ్రెస్ మంత్రి జోస్యం

ఏపీలోని తన బంధువులు, స్నేహితులు ఇచ్చిన సమాచారం మేరకు జగన్ మళ్లీ సీఎం అవుతారని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Advertisement
Update:2024-06-01 18:24 IST

ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య ఏపీలో మళ్లీ వైసీపీయే అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కాంగ్రెస్ నేత అయినా కూడా, ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున ఈసారి గట్టి ప్రచారం జరిగినా కూడా వైసీపీ విజయమే ఖాయమంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే అది తనకు వచ్చిన సమాచారమేనని, తన బంధువులు, స్నేహితులు ఇచ్చిన సమాచారం మేరకే జగన్ మళ్లీ సీఎం అవుతారని అనుకుంటున్నట్టు తెలిపారు వెంకట్ రెడ్డి. ఇక రాబోయే రోజుల్లో షర్మిల ఆధ్వర్యంలో ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము కూడా ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.

తెలంగాణ ఫలితాల తర్వాత బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతవుతుందని మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నిజామాబాద్ పార్లమెంట్‌తో సహా 12 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. రాబోయే పదేళ్లు కాంగ్రెస్సే తెలంగాణలో అధికారంలో ఉంటుందన్నారు. ఆగస్టు 15 లోపు రూ.2లక్షల లోపు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక రాష్ట్రీయ గీతం, చిహ్నంపై జరుగుతున్న వివాదంపై కూడా మంత్రి స్పందించారు. చిహ్నంపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో అందరూ రావులే నిందితులుగా ఉన్నారని సెటైర్లు పేల్చారు వెంకట్ రెడ్డి.

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్‌ను ఆహ్వానించామని.. వస్తారా రారా అనేది ఆయనకే వదిలేస్తున్నామని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు కనీవినీ ఎరుగని రీతిలో చేస్తామన్నారు. సోనియా రాక కోసం యావత్ తెలంగాణ ఎదురు చూస్తోందని తెలిపారాయన. సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని, ఆ విషయాన్ని కేసీఆర్ కూడా నిండు సభలో చెప్పారని గుర్తు చేశారు మంత్రి కోమటిరెడ్డి. 

Tags:    
Advertisement

Similar News