అది ఫోన్ ట్యాపింగ్ కాదు.. మ్యాన్ ట్యాపింగ్
కోటంరెడ్డి చెప్పినట్టు అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాదని, మ్యాన్ ట్యాపింగ్ అని కొత్త లాజిక్ చెప్పారు. చంద్రబాబు అనే వ్యక్తి ట్రాప్ లో కోటంరెడ్డి పడ్డారు కాబట్టి అది మ్యాన్ ట్యాపింగ్ అన్నారు కాకాణి.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రెస్ మీట్ల పరంపర నెల్లూరులో కొనసాగుతోంది. ఈ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ లో నెల్లూరుకి సంబంధం లేని నేతలు కోటంరెడ్డిపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో నెల్లూరు జిల్లా స్థానిక ప్రజా ప్రతినిధులు కోటంరెడ్డిని ఘాటుగా విమర్శిస్తున్నారు. ముందుగా అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టగా, ఇప్పుడు మంత్రి కాకాణి మీడియా సమావేశంలో కోటంరెడ్డిని టార్గెట్ చేశారు.
ట్యాపింగ్ అంటూ ఏదీ లేదు, కోటంరెడ్డి అపోహ పడి ఉంటారంటూ రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్లో మాట్లాడిన మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి.. ఈరోజు కోటంరెడ్డి ప్రెస్ మీట్ ఆసాంతం విని, ఆ వెంటనే తాను కూడా మీడియా సమావేశం పెట్ట కౌంటర్ ఇచ్చారు. అసలు కోటంరెడ్డి చెప్పినట్టు అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాదని, మ్యాన్ ట్యాపింగ్ అని కొత్త లాజిక్ చెప్పారు. చంద్రబాబు అనే వ్యక్తి ట్రాప్ లో కోటంరెడ్డి పడ్డారు కాబట్టి అది మ్యాన్ ట్యాపింగ్ అన్నారు కాకాణి.
ఎవరూ బయటకు వెళ్లరు..
కోటంరెడ్డి వెళ్లిపోయినా ఆయనతోపాటు ఎవరూ పార్టీని వదిలి బయటకు వెళ్లరని, కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవారందర్నీ గుర్తు పెట్టుకుంటామని, వారికి సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. ఆదాల సమర్థుడు కాబట్టే ఆయనకు ఇన్ చార్జ్ పదవి ఇచ్చారని, ఆయన హయాంలో స్థానిక సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
ఆత్మహత్యే కదా..!
కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్తున్నారంటే, ఆయన రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్టే కదా అని అన్నారు కాకాణి గోవర్దన్ రెడ్డి. కోటంరెడ్డికి జగన్ చాలా గౌరవం ఇచ్చారని, ఆయనకు నియోజకవర్గంపై పూర్తి స్వేచ్ఛను ఇచ్చారన్నారు కాకాణి. నిజంగానే పార్టీలో అవమానం జరిగితే బయటకు వెళ్లిపోవాలని, రాజకీయాలను వదిలేసి ఉంటే బాగుండేదని, కానీ టీడీపీలోకి వెళ్లే ఉద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు కాకాణి. కేవలం చంద్రబాబు ట్రాప్ లో పడి కోటంరెడ్డి అలా మాట్లాడారన్నారు. అసలు ట్యాపింగే జరగనప్పుడు ఇక విచారణతో పనేంటని ప్రశ్నించారు.
కేతిగాడు..
తోలుబొమ్మలాటలో కామెడీకోసం కేతిగాడు అనే పాత్ర ఉంటుందని, ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ది కేతిగాడు లాంటి పాత్ర అని ఘాటుగా విమర్శించారు కాకాణి. సీరియస్ గా రాజకీయాలు జరుగుతుంటే, ఆనంకు భద్రత కల్పించాలంటూ పవన్ వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలన్నారు. అలాంటి వారి వ్యాఖ్యలకు కూడా స్పందించాల్సి రావడం దౌర్భాగ్యం కాక ఇంకేంటని ప్రశ్నించారు కాకాణి.