పిచ్చి లేఖలు.. పచ్చ రాతలు
డిజాస్టర్ మేనేజ్ మెంట్ శాఖ విధివిధానాల ప్రకారం కరువు మండలాల ప్రకటన ఉంటుందని, కనీస అవగాహన లేకుండా పచ్చ పత్రికలో వార్త రాశారని విమర్శించారు కాకాణి. పిచ్చి, పచ్చ రాతలను చూసి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
కరువుపై చర్చించని కేబినెట్ మీటింగ్ ఎందుకు..? అంటూ ఇటీవల నారా లోకేష్ ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాశారు. ఆ లేఖకు వైసీపీ నుంచి సమాధానం వచ్చింది. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి కాస్త ఘాటుగా లోకేష్ కి బదులిచ్చారు. వ్యవసాయం అంటే తెలియని లోకేష్, రైతుల సమస్యలపై అవగాహన లేని లోకేష్.. వ్యవసాయంపై లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎన్నికలు వస్తున్నాయని రైతులను రెచ్చగొట్టాలని, ఓట్లు దండుకోవాలని దుర్మార్గమైన ఆలోచనతో లోకేష్, అచ్చెన్నాయుడు లేఖలు రాశారని ఆయన విమర్శించారు.
వందేళ్లలో ఈ ఏడాదే అతి తక్కువ వర్షపాతం నమోదైందని, ఏపీలో 400 మండలాల్లో కరువు తాండవిస్తుంటే, కేవలం 100 కరువు మండలాలనే ప్రభుత్వం ప్రకటించిందని లోకేష్ తన లేఖలో ప్రస్తావించారు. కరువు మండలాలపై టీడీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు మంత్రి కాకాణి. ఖరీఫ్ లో, రబీలో ఏ పంటలు వేస్తారు.. ఏ కాలువ కింద ఆయకట్టు సాగవుతుందో కూడా తెలియని వ్యక్తి నారా లోకేష్ అని ఎద్దేవా చేశారు. లోకేష్, అచ్చెన్నాయుడు రాసిన లేఖలు అవగాహన లేనివని, వాటిని చూసి పచ్చ పత్రికల్లో పిచ్చి రాతలు రాస్తున్నారని మండిపడ్డారు కాకాణి.
ప్రభుత్వంపై బురద చల్లటానికి తెలుగు రైతుల స్టీరింగ్ కమిటీ పేరుతో పంట పొలాలు పరిశీలిస్తామంటూ టీడీపీ నేతలు హడావిడి చేస్తున్నారని విమర్శించారు మంత్రి కాకాణి. చంద్రబాబు హయాంలోని 14 సంవత్సరాలు కరువు విలయతాండవం చేసిందని, అప్పుడు రైతులకు టీడీపీ ఏమి మేలు చేసిందో చెప్పి యాత్రలు చేయాలని సవాల్ చేశారు. రైతులకు హామీలు ఇచ్చి ఓట్లు దండుకున్న టీడీపీ నేతలు.. అధికారంలోకి వచ్చాక వారిని మోసం చేశారని అన్నారు. అలాంటి వారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని రైతులను పరామర్శిస్తారని ప్రశ్నించారు.
డిజాస్టర్ మేనేజ్ మెంట్ శాఖ విధివిధానాల ప్రకారం కరువు మండలాల ప్రకటన ఉంటుందని, కనీస అవగాహన లేకుండా పచ్చ పత్రికలో వార్త రాశారని విమర్శించారు కాకాణి. పిచ్చి, పచ్చ రాతలను చూసి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అన్ని విధాలుగా రైతులను ఆదుకోవటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సీఎం జగన్ హయాంలో రైతులకు ఎక్కడా అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు కాకాణి.