పవన్ పర్యటనపై మంత్రి కాకాణి సెటైర్.. 10 చూపిస్తే 5 కూడా గుర్తుపట్టలేడట!

రైతులు పంటలు ఎలా పండిస్తారో కనీస అవగాహన కూడా పవన్ కళ్యాణ్‌కి లేదని మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి విమర్శించారు.

Advertisement
Update:2023-05-11 12:39 IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి 10 పంటలు చూపిస్తే వాటిలో కనీసం 5 పంటల్ని కూడా అతను గుర్తుపట్టలేడని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం, అవలలో పవన్ కళ్యాణ్ ప‌ర్య‌టించారు. ఇటీవల కురిసిన వర్షాలకి నష్టపోయిన పంటల్ని పవన్ కళ్యాణ్ ప‌రిశీలించారు. న‌ష్ట‌పోయిన పంట‌ల‌ను రైతులు ప‌వ‌న్‌కి చూపిస్తూ తమగోడుని వెల్లబోసుకున్నారు. దాంతో రైతులకి అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు.

రాజమండ్రిలో పవన్ ప‌ర్యటన గురించి మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పంటలు ఎలా పండిస్తారో కనీస అవగాహన కూడా పవన్ కళ్యాణ్‌కి లేదని విమర్శించారు. చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ రైతుల వద్దకి వస్తున్నారనే కారణంతో తాము ధాన్యం కొనుగోలు చేయడం లేదని చెప్పుకొచ్చిన కాకాణి గోవర్ధన్‌ రెడ్డి.. తమకి వ్యవసాయం అందులో బాధలు గురించి పూర్తిగా తెలుసు కాబట్టే కొనుగోలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అలానే టీడీపీ హయాంలో రైతులకు ఆనవాయితీగా ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీని కూడా అప్పట్లో ఎగ్గొట్టినట్లు కూడా మంత్రి వెల్లడించారు.

మరోవైపు జనసేన వాదన భిన్నంగా ఉంది. ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. అకాల వర్షాలు రైతుల్ని దెబ్బతీశాయని, వైసీపీ ప్రభుత్వం వారికి సాయపడేలా ఏమాత్రం చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదని విమర్శించారు. అందుకే రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నట్లు వివరించారు. రాజమండ్రికి పవన్ కళ్యాణ్ వస్తున్నారని అధికారులు హడావుడిగా ధాన్యం కొనుగోలు చేయడం మొదలుపెట్టారన్నారు.

Tags:    
Advertisement

Similar News