భువనేశ్వరి చేయాల్సింది పాప పరిహార యాత్ర - మంత్రి జోగి రమేష్ సెటైర్
నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారని, పాపం పండినందున కోర్టులు చంద్రబాబుకు రిమాండ్ విధించాయని జోగి రమేష్ చెప్పారు.
టీడీపీ తరపున నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై మంత్రి జోగి రమేష్ సెటైర్లు వేశారు. భువనేశ్వరి.. నిజం గెలవాలి బదులు పాప పరిహార యాత్ర చేస్తే బాగుండునని అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి చేసిన పాపాలకు పరిహారం చేసేలా ఆ యాత్ర చేయాలని సూచించారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారని, పాపం పండినందున కోర్టులు చంద్రబాబుకు రిమాండ్ విధించాయని జోగి రమేష్ చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న సామాజిక సాధికార బస్సు యాత్ర పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, పార్టీ కీలక నేతలతో కలసి పాల్గొన్న మంత్రి జోగి రమేష్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
వైసీపీ తరపున 175 నియోజకవర్గాల్లో సామాజిక భేరి మోగించబోతున్నామని ఈ సందర్భంగా జోగి రమేష్ చెప్పారు. పెత్తందార్ల కోటలు బద్ధలు కొట్టబోతున్నామని తెలిపారు. ఇచ్చాపురం, తెనాలి, శింగనమలో రణభేరి మోగించబోతున్నామని, వచ్చే ఎన్నికల్లో పేదలు, పెత్తందారుల మధ్య యుద్ధం జరగబోతోందని చెప్పారు. జనరల్ సీట్లను కూడా సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చారని ఆయన తెలిపారు. అదీ నాయకత్వం అంటే.. అంటూ కొనియాడారు. జగన్ సామాజిక న్యాయం చేసిన తీరును దేశమంతా చూస్తోందన్నారు. మంచి జరిగితేనే మద్దతు ఇవ్వమని తాము కోరుతున్నామని ఆయన తెలిపారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. తాము పేదల కోసం బస్సు యాత్ర చేస్తుంటే.. జైల్లో ఉన్న వ్యక్తి కోసం మీరు యాత్ర చేస్తున్నారంటూ భువనేశ్వరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చేసిన మేలు చెప్పుకునేందుకే సామాజిక సాధికార యాత్ర చేస్తున్నామన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ని చంద్రబాబు ఎలాంటి వేధింపులకు గురి చేశారో ఇప్పటికైనా నారా భువనేశ్వరి నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ విద్యా వ్యవస్థపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్న పవన్ కల్యాణ్‌కు మంత్రి ఆదిమూలపు ఛాలెంజ్ విసిరారు. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దళిత విద్యార్థులతో పవన్ ఇంగ్లీష్ మాట్లాడగలరా అని ప్రశ్నించారు.