ఆయన ఎస్టీడీ.. ఈయన లోకల్
బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, బ్యాంకులకు కన్నం వేసి అనకాపల్లిలో తల దాచుకునేందుకు వచ్చారని ఎద్దేవా చేశారు. పువ్వు పార్టీ అనకాపల్లిలో గెలిచేది లేదన్నారు అమర్నాథ్.
అనకాపల్లి ప్రాంతానికి అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కి అసలు సంబంధమే లేదన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఆయన ఆధార్ కార్డ్ లో కూడా హైదరాబాద్ అడ్రస్ ఉంటుందన్నారు. అందుకే అనకాపల్లికి సీఎం రమేష్ ఎస్టీడీ లాంటి వారని, అనకాపల్లి వైసీపీ అభ్యర్థి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు స్థానికుడు కాబట్టి ఆయన లోకల్ అవుతారని చెప్పారు. అనకాపల్లికి బూడి లోకల్ అయితే సీఎం రమేష్ ఎస్టీడీ అన్నారు. స్థానిక ప్రజలు లోకల్ నాయకుడినే ఎన్నుకుంటారని జోస్యం చెప్పారు మంత్రి అమర్నాథ్.
సీఎం రమేష్ ఎంపీ నిధులను అనకాపల్లిలో ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టారా అని ప్రశ్నించారు మంత్రి అమర్నాథ్. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, బ్యాంకులకు కన్నం వేసి అనకాపల్లిలో తల దాచుకునేందుకు వచ్చారని ఎద్దేవా చేశారు. పువ్వు పార్టీ అనకాపల్లిలో గెలిచేది లేదన్నారు అమర్నాథ్. సీఎం రమేష్ ఆ పువ్వు చెవిలో పెట్టుకొని వెళ్లిపోవడమే మిగిలుందని ఎద్దేవా చేశారు.
జగన్ ని సీఎం చేసేందుకు ఏదైనా చేస్తానని అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఏపీలో వైసీపీ తరపున ఎవరు పోటీ చేస్తున్నా.. పేదవాడికి కనిపించేంది మాత్రం సీఎం జగన్ ఒక్కరేనన్నారు. ఆయన్ను చూసే జనం తమకు ఓట్లు వేస్తారన్నారు. తమకు మంచి చేసిన జగన్‌కే మళ్లీ ఓటువేసి గెలిపించాలని పేదవారు అనుకుంటారని చెప్పారు మంత్రి అమర్నాథ్.