ఎన్నికల అవసరాల కోసం మోడీ అబద్ధాలు
రాష్ట్రానికి వచ్చిన నరేంద్ర మోడీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని ప్రజలు భావించారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. కానీ మోడీ స్టీల్‌ప్లాంట్ ఊసే ప్రస్తావించలేదని ఆయన విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల అవసరాల కోసం అబద్ధాలు వల్లె వేస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంపై మాట్లాడని మోడీ ఇప్పుడు మాట్లాడడం వారి అమాయకత్వానికి నిదర్శనమని చెప్పారు. మోడీ ఆరోపణలను ఖండిస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో నిర్వహించిన సభలో నరేంద్ర మోడీ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
నరేంద్ర మోడీ కేవలం చంద్రబాబు స్క్రిప్ట్ మొత్తం చదివారని అమర్నాథ్ విమర్శించారు. గతంలో చంద్రబాబుపై మోడీ తీవ్రమైన విమర్శలు చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. పోలవరాన్ని ఏటీఎంలా చంద్రబాబు మార్చుకున్నారని మోడీ విమర్శించారని గుర్తుచేశారు. ఇప్పుడు మాత్రం ఎన్నికల ప్రయోజనాల కోసం బాబే కాదు మోడీ కూడా యూటర్న్ తీసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి వచ్చిన నరేంద్ర మోడీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని ప్రజలు భావించారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. కానీ మోడీ స్టీల్‌ప్లాంట్ ఊసే ప్రస్తావించలేదని ఆయన విమర్శించారు. ప్రజా సంక్షేమం గురించి ఆలోచించకుండా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా భావిస్తున్న బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిని ప్రజలు ఓడించి బుద్ధి చెప్పాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
మరోపక్క చంద్రబాబు ఈసారి కూడా తనకు అధికారం రాదని అర్థమైపోవడంతో.. ఫ్రస్ట్రేషన్‌లో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ఎవరికి ఎవరు మొగుడు అవుతారో చంద్రబాబుకు తెలుస్తుందని ఆయన హెచ్చరించారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను అసెంబ్లీలో స్వాగతించింది టీడీపీ అని ఆయన గుర్తుచేశారు. రైల్వే జోన్‌కు జగన్ ప్రభుత్వం భూములు ఇవ్వలేదంటూ ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి అబద్ధాలు మాట్లాడటం తగదని ఆయన చెప్పారు. రైల్వే జోన్‌కు సంబంధించి ఇప్పటికే భూములను అధికారులు అప్పగించారని ఆయన తెలిపారు.