తన అధికార దాహానికి బాబు ఎంత మందినైనా బలి తీసుకుంటాడు - మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆగ్రహం

మొన్న పుంగనూరు బైపాస్‌లో పోలీసులపై టీడీపీ దాడికి ముమ్మాటికీ చంద్రబాబే కారకుడని, ఈ కేసులో అతనే ప్రథమ ముద్దాయి అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు.

Advertisement
Update:2023-08-08 17:00 IST

తన అధికార దాహం తీర్చుకోవడం కోసం చంద్రబాబు ఎంతమందినైనా బలి తీసుకుంటాడని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్‌ సర్క్యూట్‌ హౌస్‌లో మంగళ‌వారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొన్న పుంగనూరు బైపాస్‌లో పోలీసులపై టీడీపీ దాడికి ముమ్మాటికీ చంద్రబాబే కారకుడని, ఈ కేసులో అతనే ప్రథమ ముద్దాయి అని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు ఒక వైపు దెబ్బలు తింటున్నా.. ఎక్కడా సంయమనం కోల్పోకుండా నిబద్ధతతో విధులు నిర్వహించారని, దీంతో చంద్రబాబు దుష్ట ఆలోచన పారలేదని చెప్పారు. హింసాత్మక రాజకీయాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పారు. పుంగనూరులో ఆయన ఇదేవిధమైన కుట్రను అమలు చేశాడని, పోలీసుల్ని రెచ్చగొట్టడం, తద్వారా వారు ఫైరింగ్‌ ఓపెన్‌ చేస్తే..ఎవరో ఒకరు చనిపోతే.. మా పార్టీ కార్యకర్తల్ని అన్యాయంగా చంపారంటూ ఒక డ్రామాతో రాజకీయ లబ్ధి పొందాలనేది బాబు రాజకీయ పన్నాగమని చెప్పారు. దీనిని బట్టి అతనెంత నీచుడనేది టీడీపీలో పనిచేస్తున్న నేతలు, కార్యకర్తలు అర్థం చేసుకోవాలన్నారు.

పచ్చ మీడియా తీరుపై ఆగ్రహం

పుంగనూరు ఘటనలో 50 మంది పోలీసులకు తీవ్రగాయాలై.. ఒక కానిస్టేబుల్‌కు కన్నుపోయిన ఘటనపై పచ్చమీడియా ఏమాత్రం బాధ్యతలేనట్టుగా వ్యవహరించిందని మంత్రి అమర్‌నాథ్‌ మండిపడ్డారు. కొన్ని పత్రికలు, ఛానెళ్లు ఈ ఘటనపై నిజాయితీగా కవరేజీ ఇచ్చి పోలీసులపై దాడికి చంద్రబాబే కారకుడని తేల్చి చెప్పినా.. టీడీపీకి వత్తాసు పలికే పచ్చమీడియా మాత్రం ఇదేమీ పట్టనట్టు.. ఇదేదో వేరే రాష్ట్రాల్లో జరిగిన అంశమని.. లోతుల్లోకి వెళ్లి కథనాలు రాయాల్సిన పనిలేదన్నట్లు మౌనం దాల్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబుపై రౌడీషీట్‌ తెరవాలి

పుంగనూరు ఘటనకు సంబంధించి చంద్రబాబుపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. అధికారంలోకొచ్చేందుకు ఎంతకైనా బరితెగించే చంద్రబాబు ఈ రాష్ట్రానికి హానికారి అని పుంగనూరు ఘటనతో తేటతెల్లమైందన్నారు. చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి సంయమనంతో వ్యవహరించబట్టే పెను ప్రమాదం తప్పిందని మంత్రి అమర్‌నాథ్‌ చెప్పారు. ఆయన గతంలో నర్సీపట్నం ఏఎస్‌పీగా కూడా పనిచేసిన సమర్ధుడైన పోలీసు అధికారి అని గుర్తుచేశారు. ఈ కుట్రను సమర్ధంగా ఎదుర్కొని తిప్పికొట్టిన ఎస్పీ రిషాంత్‌రెడ్డి పై బాబు, లోకేశ్‌లు ఇష్టానుసారంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు.

పోలీసులకు తీవ్రగాయాలైతే పవన్‌ స్పందించడా?

ఇటీవల జనసేన పార్టీ కార్యకర్తపై ఒక పోలీసు మహిళా అధికారి చేయి చేసుకున్నారని రచ్చరచ్చ చేసిన పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడెక్కడ ఉన్నాడని మంత్రి అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. పుంగనూరు ఘటనలో దాదాపు 50 మంది పోలీసులకు తీవ్ర గాయాలై.. ఒకరికి కన్ను పోయి.. వాహనాలు ధ్వంసమై నష్టంవాటిల్లితే పవన్ కళ్యాణ్‌కు కనిపించడం లేదా.. వినిపించడంలేదా..అని ప్రశ్నించారు. తన దత్త తండ్రికి మద్ద‌తుగా నిలవడానికి తన సొంత తండ్రి పనిచేసిన పోలీసు శాఖలో సాటివారికి గాయాలైనా నోరుమెదపడా అని నిలదీశారు.

Tags:    
Advertisement

Similar News