పొలిటికల్‌ బ్రోకర్‌ తప్పుడు ప్రచారం మానుకోవాలి

హిందూపురంలో 350 ఎకరాలను క్విడ్‌ ప్రోకో కింద నియోజన్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి కట్టబెట్టారంటూ మనోహర్‌ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement
Update:2023-12-14 11:46 IST

జనసేన నేత నాదెండ్ల మనోహర్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన్ని పొలిటికల్‌ బ్రోకర్‌ అంటూ విమర్శించారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అమర్నాథ్‌ మాట్లాడుతూ.. హిందూపురంలో 350 ఎకరాలను క్విడ్‌ ప్రోకో కింద నియోజన్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి కట్టబెట్టారంటూ మనోహర్‌ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆ సంస్థకు పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం 350 ఎకరాలు కేటాయించారని, అయితే ఆ సంస్థ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం సాధ్యం కాదని, ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుకు ప్రతిపాదించిందని మంత్రి తెలిపారు. రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ భూమి కేటాయింపును రద్దుచేయడంతో ఆ సంస్థ కోర్టుకు వెళ్లిందని చెప్పారు. జగన్‌మోహన్‌నెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూమిని మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలన్న ఆలోచనలతో నియోజన్‌ యాజమాన్యాన్ని సంప్రదించి కోర్టు కేసు విత్‌ డ్రా చేసుకోవాలని సూచించారని తెలిపారు. ఇప్పుడు ఆ భూములు అందుబాటులోకి వచ్చాయని, అక్కడ పరిశ్రమల ఏర్పాటు ద్వారా వేలాదిమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. దీనివల్ల నాదెండ్ల మనోహర్‌కు ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.

తెలంగాణ ఫలితాల తర్వాత వారికి మతిభ్రమించింది...

తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత మనోహర్‌ అండ్‌ పార్టీకి మతిభ్రమించిందని మంత్రి అమ‌ర్ ఎద్దేవా చేశారు. ప్రజల నుంచి ఆ పార్టీకి మద్దతు లేకుండా పోయిందని గుర్తుచేశారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం జనసేన, తెలుగుదేశం పార్టీలకు ఇష్టం లేదని, నిరంతరం ప్రజలను తప్పుదోవ పట్టించడమే ఆ పార్టీల లక్ష్యమని చెప్పారు. నాదెండ్ల మనోహర్‌ ఇలాంటి వ్యాఖ్యలు మానుకుని పార్టీల మధ్య బ్రోకరిజం చేసుకోవాలని సూచించారు. పవన్‌ కల్యాణ్‌ అజ్ఞాతవాసి అని, నాదెండ్ల మనోహర్‌ అజ్ఞానవాసి అని ఈ సందర్భంగా ఆయన ఎద్దేవా చేశారు.

Tags:    
Advertisement

Similar News