చంద్రబాబు నటన, నాట్యం చూస్తే.. జయప్రదే సిగ్గుపడుతుంది..

ప్రకృతి వైపరీత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు.. వరద ప్రాంతాల్లో పర్యటించడం సిగ్గుచేటని అన్నారు.

Advertisement
Update:2022-07-29 20:43 IST

చంద్రబాబు నటన, నాట్యం చూస్తే.. హీరోయిన్ జయప్రద కూడా సిగ్గు పడుతుందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు మంత్రి గుడివాడ అమర్నాథ్. నటనలో ఎన్టీఆర్ ని సైతం చంద్రబాబు మించిపోయారని ఎద్దేవా చేశారు. ప్రకృతి వైపరీత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు.. వరద ప్రాంతాల్లో పర్యటించడం సిగ్గుచేటని అన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం లక్ష కుటుంబాలకు వరద సాయం అందించిందని చెప్పారు. తీరిగ్గా ఇప్పుడు వరద ప్రాంతాలకు వెళ్తున్న బాబు, వరద సాయంపై ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని, అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

హుద్ హుద్ ని కూడా ప్రచారానికి..

గతంలో హుద్ హుద్ ధాటికి విశాఖ అల్లాడిపోతే దాన్ని కూడా తన ప్రచారానికి వాడుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు మంత్రి అమర్నాథ్. బాధితుల్ని మాత్రం ఆయన ఆదుకోలేదని చెప్పారు. చంద్రబాబు హామీలు పేపర్లలో తప్ప, చేతల్లో ఉండవని అన్నారు అమర్నాథ్. వరద నష్టం అంచనా వేసిన తర్వాత నష్ట పరిహారాన్ని పంపిణీ చేస్తారని, చంద్రబాబు దాన్ని కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారని, కానీ తక్షణ సాయం చేసినట్టు వరద ప్రాంతాల ప్రజలకు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు అమర్నాథ్.

విలీన మండలాలను జిల్లాగా..

తెలంగాణ నుంచి ఏపీలో విలీనం అయిన మండలాలను ప్రత్యేక రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామని ఇదివరకే సీఎం జగన్ హామీ ఇచ్చారు. అయితే విలీన మండలాలకు వెళ్లిన చంద్రబాబు ఆయా ప్రాంతాలన్నింటినీ కలిపి ఒకటే జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై మంత్రి అమర్నాథ్ స్పందించారు. గతంలో అధికారంలో ఉండగా చేయలేని పనుల్ని, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక చంద్రబాబు హామీల రూపంలో ప్రకటిస్తున్నారని ఎద్దేవా చేశారు. విలీన మండలాలతో ప్రత్యేక జిల్లాను చేసే అంశాన్ని తమ ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News