ఇకపై రాజు మారడు, రాజధాని మారదు.. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్లు..

ప్రస్తుతం జనసేన నాయకుల్ని మాత్రమే అరెస్ట్ చేశారని, పవన్ కల్యాణ్ వైఖరి ఇలాగే ఉంటే, ఆయన్ని కూడా అరెస్ట్ చేయొచ్చని హెచ్చరించారు మంత్రి అమర్నాథ్.

Advertisement
Update:2022-10-16 13:25 IST

రాజు మారినప్పుడల్లా రాజధాని మారాలంటే ఎలా..? చంద్రబాబు తర్వాత జగన్ వస్తే, జగన్ కి నచ్చినచోట రాజధాని పెట్టాలంటే ఎలా కుదురుతుంది.. ? ఇదీ పవన్ కల్యాణ్ లాజిక్. దీన్ని తనదైన శైలిలో తిప్పికొట్టారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇకపై రాజు మారే అవకాశం లేదని, అందుకే రాజధాని మార్పుకూడా ఉండదని తేల్చిచెప్పేశారు. ఏపీకి జగనే శాశ్వత సీఎంగా ఉంటారని, అందుకే రాజధాని మార్పు అనే ప్రశ్న ఉండదని, జగన్ హయాంలో ఏర్పడిన మూడు రాజధానులు అలాగే ఉంటాయని చెప్పుకొచ్చారు అమర్నాథ్.

పొలిటికల్ టెర్రరిస్ట్..

విశాఖ ఎయిర్ పోర్ట్ దాడి ఘటన తర్వాత జనసైనికుల్ని జన సన్నాసులని, జన సైకోలని తీవ్ర విమర్శలు చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్, తాజాగా పవన్ ని పొలిటికల్ టెర్రరిస్ట్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ విశాఖ వచ్చింది ఆయన ప్రైవేటు అజెండా అమలు చేయడానికేనన్నారు. జనవాణి కోసం కాదని, చంద్రబాబు బాణి వినిపించడానికి పవన్ కల్యాణ్ వచ్చారని చెప్పారు. పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ అని మరోసారి రుజువైందని ఎద్దేవా చేశారు. మంత్రుల మీద దాడి చేస్తే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా..? అని ప్రశ్నించారు అమర్నాథ్.

పవన్ ని కూడా అరెస్ట్ చేయొచ్చు..

ప్రస్తుతం జనసేన నాయకుల్ని మాత్రమే అరెస్ట్ చేశారని, పవన్ కల్యాణ్ వైఖరి ఇలాగే ఉంటే, ఆయన్ని కూడా అరెస్ట్ చేయొచ్చని హెచ్చరించారు మంత్రి అమర్నాథ్. ఒక్కో చోట ఒక్కో పెళ్లాన్ని పెట్టుకున్న పవన్, మా గురించి మాట్లాడతారా..? అంటూ మండిపడ్డారు అమర్నాథ్. మరోసారి ఆయన పవన్ వివాహాలను ప్రస్తావించారు. విశాఖ గర్జన తర్వాత జరుగుతున్న వరుస పరిణామాలు ఏపీలో పొలిటికల్ హీట్ పెంచాయి. పవన్ కల్యాణ్ పై మంత్రుల విమర్శలు, దానికి ఆయన కౌంటర్లు, వాటికి మళ్లీ మంత్రుల ప్రతి విమర్శలు.. ఇలా కొనసాగుతోంది ఈ ఎపిసోడ్. మాటలు పెంచుకుంటూ పోతూ, విమర్శల్లో ఇరు వర్గాలూ శృతి మించుతున్నాయి. మరో రెండురోజులపాటు ఈ మాటల యుద్ధం ఇలాగే కొనసాగేలా కనిపిస్తోంది.

Advertisement

Similar News