మా దేవుడి దగ్గరకొచ్చి మాకే శాపనార్థాలు పెడతారా?

పాదయాత్ర పేరుతో వస్తున్న దుష్టశక్తులను, దుర్మార్గులను ఎక్కడికక్కడే అడ్డుకట్ట వేసి ఆపేయాలన్నారు. అడుగు ముందుకు వేయకుండా అడ్డుకోవాలన్నారు మంత్రి బొత్స.

Advertisement
Update:2022-10-02 08:18 IST

అమరావతి రైతుల పాదయాత్రపై మరోసారి మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. మా దేవుడి దగ్గరకు వచ్చి మాకే శాపనార్థాలు పెడతారా..? అంటూ ప్రశ్నించారు. కాకినాడలో వికేంద్రీకరణకు మద్దతుగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన, అమరావతి యాత్రను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్ని కష్టాలొచ్చినా వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలంతా మూడు రాజధానులకు మద్దతివ్వాలని కోరారాయన. ప్రజలంతా గొంతెత్తి వికేంద్రీకరణకు మద్దతు తెలపాలన్నారు. పాదయాత్ర పేరుతో వస్తున్న దుష్టశక్తులను, దుర్మార్గులను ఎక్కడికక్కడే అడ్డుకట్ట వేసి ఆపేయాలన్నారు. అడుగు ముందుకు వేయకుండా, ఇలాంటి దౌర్భాగ్య కార్యక్రమాలు చేయనీయకుండా అడ్డుకోవాలన్నారు.

దొంగలు, దోపిడీదారులు..

అమరావతి యాత్ర పేరుతో వస్తున్నవారంతా దొంగలు, దోపిడీదారులంటూ మండిపడ్డారు మంత్రి బొత్స. రాష్ట్ర ప్రజలంతా నాశనమై, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకునే వారు మాత్రమే బాగుపడాలా అని ప్రశ్నించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, దొంగలు, దోపిడీదారులు పాదయాత్రగా వస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరి కష్టాన్ని 29 గ్రామాల గోతుల్లో పోయాలనేది వారి లక్ష్యం అని, దానికి ఇతర ప్రాంతాల ప్రజలు ఎందుకు తలొగ్గుతారని అన్నారు. టీడీపీ ప్రజాభిమానం కోల్పోయిందని, ఇప్పుడు అమరావతి ముసుగులో ఆ పార్టీ ప్రజల్లోకి రావాలని చూస్తోందని చెప్పారు. అందుకే అమరావతి పాదయాత్ర పేరుతో రాయలసీమకు ఓసారి, ఉత్తరాంధ్రకు ఓసారి దండెత్తి వస్తున్నారని అన్నారు మంత్రి బొత్స.

కాకినాడకు ఇచ్చేస్తారా..?

అన్నవరం టు తిరుపతి అనే పేరు పెట్టి 50 వేల మందితో పాదయాత్ర చేస్తానని, కాకినాడ జిల్లాకే రాష్ట్ర సంపద అంతా తెచ్చిపెడతారా, రాజధాని ఇచ్చేస్తారా అని ప్రశ్నించారు మంత్రి దాడిశెట్టి రాజా. పాలనంతా ఒకచోటే ఉండాలనే స్వార్థపూరిత నిర్ణయం చంద్రబాబుదని చెప్పారు. కాకినాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రులు బొత్స, దాడిశెట్టి రాజా, వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి కన్నబాబు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వైసీపీ ప్రభుత్వం అధికార వికేంద్రీకరణకే కట్టుబడి ఉంటుందని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News