నువ్వు పెద్ద పోటుగాడివని ఫిర్యాదు చేస్తాం మరి!- పవన్‌ పై బొత్స

పార్టనర్‌ చంద్రబాబు ఐదేళ్లలో ఎన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చారో అడిగారా అని బొత్స ప్రశ్నించారు. విజయనగరం వెళ్లారు కదా.. అక్కడ ఎవరైనా వచ్చి ఇళ్ల స్థలాల కోసం లంచాలు ఇచ్చామని చెప్పారా అని నిలదీశారు.

Advertisement
Update:2022-11-14 14:20 IST

జగనన్న కాలనీలపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని.. అది పవన్ కల్యాణ్‌కు కనిపించడం లేదా.. అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇల్లు లేని వారే ఉండకూదన్న ఉద్దేశంతో ఇంత పెద్ద కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారన్నారు. ఇందు కోసం 71వేల ఎకరాల భూమిని సేకరించామన్నారు.

ఇప్పటి వరకు భూములు కొనుగోలుకు, మౌలిక సదుపాయాలకు 15వేల కోట్లు ఖర్చు చేశామని ఇది అవాస్తవమని చెప్పగలరా అని నిలదీశారు. వాస్తవాలు ఇలా ఉంటే సెలబ్రెటీ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ మాత్రం అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఖర్చు పెట్టిందే 15వేల కోట్లు అయితే.. 15వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని పవన్ ఎలా చెబుతున్నారని నిలదీశారు.

పార్టనర్‌ చంద్రబాబు ఐదేళ్లలో ఎన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చారో అడిగారా అని బొత్స ప్రశ్నించారు. విజయనగరం వెళ్లారు కదా.. అక్కడ ఎవరైనా వచ్చి ఇళ్ల స్థలాల కోసం లంచాలు ఇచ్చామని చెప్పారా అని నిలదీశారు. పవన్‌ కల్యాణ్‌ వచ్చినా కమెడియన్‌ వచ్చినా జనం రావడం అన్నది సహజమన్నారు.

ఢిల్లీకి వెళ్లి తనపై ఫిర్యాదు చేశారని పవన్ కల్యాణ్ చెప్పుకుంటున్నారని.. పెద్ద పోటుగాడివని ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేస్తాం మరి అని బొత్స ఎద్దేవా చేశారు. పవన్‌ తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని.. అందుకే ఇలా ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారని ఊహించుకుంటున్నారని విమర్శించారు. తనలో ఉన్న గుణాలన్నీ ఇతరుల్లో ఉన్నాయని పవన్ భ్రమిస్తున్నారన్నారు.

చంద్రబాబునాయుడిని క్రెయిన్‌లతో లేపినా లేచే పరిస్థితి లేదని.. పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న ప్రయత్నాలన్నీ వృథా అని బొత్స విమర్శించారు. సొంతంగా ఇల్లు కట్టుకుంటామని స్థలం తీసుకున్న వారు కొద్దిగా నెమ్మదిగా నిర్మించుకుంటున్నారని.. దానికి పవన్‌ కల్యాణ్ ఎందుకు ఆందోళన చెందుతున్నారని నిలదీశారు. కొద్దిగా ఆలస్యంగానైనా ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతాయన్నారు. పవన్‌ది చంద్రబాబుతో కాపురం, బీజేపీ పొత్తు అని అందరికీ తెలుసన్నారు.

బీజేపీ నేతలు తెలంగాణకు వెళ్లి సింగరేణిలో మెజారిటీ వాటా తమది కాదని, కాబట్టి ప్రైవేటీకరణ చేయబోమంటున్నారని.. ఏపీకి వస్తే మాత్రం విశాఖ స్టీల్‌ ప్లాంట్ పూర్తిగా కేంద్రానిదే అయినప్పటికీ దానిపై మాత్రం మాట్లాడడం లేదన్నారు. ఈ తీరును రాష్ట్ర ప్రభుత్వం నిరసిస్తోందన్నారు.

Tags:    
Advertisement

Similar News