సీమెన్స్ కుంభకోణంలో చంద్రబాబుకు శిక్ష తప్పదు.. - మంత్రి బొత్స
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి, విశాఖ రాజధానికి సంబంధమేమిటని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆయా ఎన్నికల్లో ఓట్లేసినవారు ఒక్క శాతం మాత్రమే ఉన్నారని, అయినా దీనిని తాము తేలికగా తీసుకోవడం లేదని చెప్పారు.
సీమెన్స్ కుంభకోణంలో చంద్రబాబుకు శిక్ష తప్పదని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో సీమెన్స్ కుంభకోణంలో చంద్రబాబు అండ్ కో దోపిడీకి పాల్పడ్డారని, ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆయన ఆరోపించారు. ఆదివారం ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
రూ.300 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోజే టీడీపీ ప్రభుత్వాన్ని ఈడీ హెచ్చరించినా ఎందుకు పట్టించుకోలేదని బొత్స ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు కూడా భాగస్వామ్యుడు కాబట్టే.. ఆయన దర్యాప్తు చేయించేందుకు వెనకడుగు వేశాడని విమర్శించారు. గతంలో తాను పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్ కుంభకోణం జరిగిందంటూ లేని విషయాలను ప్రచారం చేశారని ఆయన విమర్శించారు. అప్పట్లో తామే స్వచ్ఛందంగా సీబీఐ విచారణ కోరామని మంత్రి బొత్స గుర్తుచేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి, విశాఖ రాజధానికి సంబంధమేమిటని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆయా ఎన్నికల్లో ఓట్లేసినవారు ఒక్క శాతం మాత్రమే ఉన్నారని, అయినా దీనిని తాము తేలికగా తీసుకోవడం లేదని చెప్పారు. వారిలోనైనా అసంతృప్తి ఎందుకు వచ్చిందో.. సమన్వయలోపం ఎక్కడ ఉందో బేరీజు వేసుకుని సమస్యను అధిగమిస్తామని బొత్స చెప్పారు.