యాత్రపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్స..
అమరావతి రైతుల పాదయాత్రను ఎలా ఆపగలమో చూస్తారా? యాత్రను ఎలా ఆపగలమో ముందే మీకు చెప్పి చేయాల్సిన అవసరం లేదని మీడియా సమావేశంలో ఘాటుగా మాట్లాడారు మంత్రి బొత్స.
ప్రస్తుతం ఏపీలో అమరావతి యాత్ర హాట్ టాపిక్ గా ఉంది. యాత్ర ఉత్తరాంధ్రకు చేరుకునే క్రమంలో వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఇటీవల యాత్ర విషయంలో మంత్రి బొత్స హాట్ కామెంట్స్ చేశారు. తాము తలచుకుంటే యాత్రను అడ్డుకోవడం ఐదు నిముషాల పని అన్నారు. ఆయన ఉద్దేశం ఏంటో కానీ, చివరకు మీడియాలో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో ఆయన సర్ది చెప్పుకుంటారనుకున్నారు, కానీ ఆయన తగ్గేది లేదంటున్నారు. ఆ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానంటున్న బొత్స.. యాత్రను ఎలా అడ్డుకుంటారో మీకు చెప్పి చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.
త్యాగం అంటే వారిది.. వీరిది కాదు..
పోలవరం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు అసలైన త్యాగధనులని, త్యాగం అంటే వారిదని అన్నారు మంత్రి బొత్స. అమరావతి రైతులు చేసింది త్యాగం ఎలా అవుతుందని ప్రశ్నించారు. అమరావతి రైతులు భూములు ఇచ్పి ప్రభుత్వం నుంచి అనేక ప్రయోజనాలు పొందారని, కౌలు తీసుకుంటున్నారని, బదులుగా అభివృద్ధి చేసిన నివాస స్థలాలు తీసుకుంటున్నారని అన్నారు. దీన్ని త్యాగం అనరని వ్యాపారం అంటారని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతుంది అమరావతి రైతుల పాదయాత్ర కాదని, రియల్ ఎస్టేట్ యాత్ర అని అన్నారు బొత్స. అమరావతి నిర్మాణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందని చెప్పారు.
తప్పుడు ప్రచారం తగదు..
తనపై కొన్ని ప్రసార మాధ్యమాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు బొత్స. ఓ ప్రాంతానికి చెందినవారు మరో ప్రాంతంలో అభివృద్ధిని అడ్డుకుంటామంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాలను తాము అమలు చేస్తున్నామని చెప్పారు. తనపై దుష్ప్రచారం జరుగుతోందని, అయినా తాను భయపడబోనని అన్నారు. కన్నెర్రజేస్తే యాత్రలు ఆగిపోతాయని.. తలుచుకుంటే 5 నిమిషాల్లో పాదయాత్రను ఆపుతామన్న మాటలకు తాను కట్టుబడి ఉన్నట్లు చెప్పారు బొత్స. అమరావతి రైతుల పాదయాత్రను ఎలా ఆపగలమో చూస్తారా? యాత్రను ఎలా ఆపగలమో ముందే మీకు చెప్పి చేయాల్సిన అవసరం లేదని మీడియా సమావేశంలో ఘాటుగా మాట్లాడారాయన.