మేమే అధికారంలోకి వస్తాం.. పథకాల డబ్బులు మేమే ఇస్తాం

డీబీటీ పద్ధతిలో డబ్బులు వేస్తుంటే అడ్డుపడిన టీడీపీకి లబ్ధిదారుల ఉసురు తగలడం గ్యారెంటీ అని అన్నారు మంత్రి బొత్స.

Advertisement
Update:2024-05-10 21:15 IST

గత ఎన్నికల సమయంలో టీడీపీ పసుపు-కుంకుమల పేరుతో డబ్బులు ఇచ్చిందని, ఈసారి డీబీటీ పథకాలకు డబ్బులు ఇస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేది తామేనని, ఈసీ అడ్డు తగిలితే అధికారంలోకి వచ్చాకే డబ్బులు జమ చేస్తామని అన్నారు. లబ్ధిదారులను టీడీపీ ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు బొత్స.

డీబీటీ పద్ధతిలో డబ్బులు వేస్తుంటే అడ్డుపడిన టీడీపీకి లబ్ధిదారుల ఉసురు తగలడం గ్యారెంటీ అని అన్నారు మంత్రి బొత్స. చంద్రబాబు జేజమ్మలు దిగి వచ్చినా ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కాలేడని అన్నారు. చేయూత డబ్బులు మూడో నెలలో సమకూర్చామని, నాలుగో నెలలో వేయాలనుకున్నామని, ఎన్నికల కోడ్ అడ్డుపెట్టారని విమర్శించారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, విద్యా దీవెన, చేయూత నిధులు కూడా ఇవ్వనీయడం లేదన్నారు బొత్స.

అధికారం లేకపోయినా టీడీపీ ఇలాంటి అరాచకాలకు పాల్పడుతోందని, ఇలాంటి వారికి ఓటేస్తే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవాలన్నారు బొత్స. ఈసీ కూడా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారాయన. ఫిర్యాదులు వస్తే తలొగ్గడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. డీబీటీ ద్వారా నిధులు జమచేయాలని రాత్రి కోర్టు ఆర్డర్ ఇస్తే.. ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. ప్రతిపక్షాల కుట్రల్ని ప్రజలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని, ఎన్నికల్లో వారిని ఓడించి బుద్ధి చెప్పాలన్నారు మంత్రి బొత్స. 

Tags:    
Advertisement

Similar News