ఎన్నికల్లో చంద్రబాబు మిమిక్రీ.. బొత్స సెటైర్లు
అనుకున్నదానికంటే 2 శాతం ఎక్కువగా పోలింగ్ జరగడం వైసీపీకే మేలు చేసిందని, సంక్షేమ పథకాలు ఆగకూడదనే ఉద్దేశంతో ప్రజలంతా ఓటు వేసేందుకు తరలి వచ్చారని వివరించారు బొత్స.
ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు మిమిక్రీ చేశారని, పెన్షన్ డబ్బులు ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారని మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. చేయూత పథకాన్ని కూడా అడ్డుకున్నారని చెప్పారు. ఏపీలో 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే పల్నాడు ఘటన మినహా మిగతా వాటి గురించి టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడటంలేదని నిలదీశారు. ఓటమి భయంతో వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని అన్నారు. పేదలంటే చంద్రబాబుకు ఎప్పుడూ పడదని, ధనవంతులు, బలిసినవారే చంద్రబాబుకు కావాలన్నారు. అందుకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి సంక్షేమ పథకాలు పేదలకు అందనీయకుండా చేశారని విమర్శించారు బొత్స.
కావాలనే 4 జిల్లాల్లో ఎస్పీ స్థాయి అధికారులను బదిలీ చేశారని, అక్కడే దురదృష్టకర సంఘటనలు జరిగాయని, వాటికి కూటమి నేతలే బాధ్యులని అన్నారు మంత్రి బొత్స. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా ఈసారి వైసీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. 175 స్థానాల్లో తామే గెలవబోతున్నామని అన్నారు. జూన్-9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం ఖాయమని అంటున్నారు బొత్స.
తమ నాయకుడు ముందే చెప్పి విదేశాలకు వెళ్లారని, కానీ చంద్రబాబు, ఆయన కుమారుడు చెప్పకుండానే విదేశాలకు వెళ్ళిపోయారని ఎద్దేవా చేశారు బొత్స. రాష్ట్రంలో ఎప్పుడూ ఇలాంటి వాతావరణం లేదన్నారు. అల్లర్లు, దాడుల వంటి ఘటనలు కొనసాగించకూడదని టీడీపీని కోరుతున్నానన్నారు. అనుకున్నదానికంటే 2 శాతం ఎక్కువగా పోలింగ్ జరగడం వైసీపీకే మేలు చేసిందని, సంక్షేమ పథకాలు ఆగకూడదనే ఉద్దేశంతో ప్రజలంతా ఓటు వేసేందుకు తరలి వచ్చారని వివరించారు బొత్స. నిస్పక్షపాతంగా అమలు చేసిన సంక్షేమ పథకాలు, మధ్యవర్తిత్వం లేకుండా తీసుకొచ్చిన సంస్కరణలు తమ విజయానికి కారణం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.