పవన్ హీరో కాదు, కమెడియన్.. అంబటి సెటైర్లు
రౌడీని రౌడీ అంటే అచ్చం రౌడీలాగే పవన్ రియాక్ట్ అయ్యారని సెటైర్లు పేల్చారు మంత్రి అంబటి. పవన్ వెంట నడిచేవారంతా కుక్కతోక పట్టి గోదావరి ఈదినట్టేనని ఎద్దేవా చేశారు.
మూడు రాజధానుల విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత వైసీపీ నేతలు చంద్రబాబు, పవన్ పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు.. బాబు, పవన్ ఇద్దరిపై సెటైర్లు పేల్చారు. మధ్యంతర ఉత్తర్వుల తర్వాతయినా చంద్రబాబుకు జ్ఞానోదయం అవుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు అంబటి. పవన్ కల్యాణ్ పై మాత్రం ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రౌడీని రౌడీ అంటే అచ్చం రౌడీలాగే పవన్ రియాక్ట్ అయ్యారని సెటైర్లు పేల్చారు అంబటి. పవన్ వెంట నడిచేవారంతా కుక్కతోక పట్టి గోదావరి ఈదినట్టేనని చెప్పారు.
పవన్ కి 4 ప్రశ్నలు..
పవన్ కల్యాణ్ కి 4 సూటి ప్రశ్నలు వేశారు మంత్రి అంబటి రాంబాబు. మళ్ళీ భీమవరం నుంచి పోటీ చేస్తావా? గాజువాక నుంచి పోటీ చేస్తావా? కనీసం 25 స్థానాల్లో అయినా పోటీ చేస్తావా? ఎవరితో కలిసి పోటీ చేస్తావ్? అంటూ పవన్ కి నాలుగు ప్రశ్నలు సంధించారు అంబటి. ఇళ్లు కూలిపోయినట్టు పవన్ ఇప్పటం గ్రామస్తులతో దొంగ సంతకాలు పెట్టించారని, దొంగ సంతకాలు పెట్టి కోర్టుతో పెనాల్టీ వేయించుకోవటం ఉద్యమం చేయడమా అని నిలదీశారు. ఇప్పటంలో పవన్ అసలు రంగు బయటపడిందన్నారు.
దొంగయాత్ర శాశ్వతంగా ఆగిపోయినట్టే..
అమరావతిలో అసలు రైతులు ఉన్నారా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. పాదయాత్రలో ఐడెంటిటీ కార్డ్ అడిగితే దొంగ రైతులు పారిపోయారని, అమరావతి రైతుల పాదయాత్రకు విరామం శాశ్వతం అని తాను అప్పుడే చెప్పానని, అది ఇప్పుడు నిజమైందని అన్నారు. అమరావతి ప్రాంతంలోని నిజమైన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు అంబటి.
పవన్ హీరో కాదు, కమెడియన్..
పవన్ కల్యాణ్ హీరో కాదని కమెడియన్ అని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు. అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వికేంద్రీకరణకు బలాన్ని ఇస్తుందన్నారు. రాజధానుల నిర్ణయంలో న్యాయస్థానాల జోక్యం సరైనది కాదని దీన్ని బట్టి అర్థం అవుతోందన్నారు.