33 ఏళ్లుగా ఎమ్మెల్యే.. కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి కాలేదు..
చంద్రబాబుకి కుప్పం అంటే భయం పుట్టుకొచ్చిందని అన్నారాయన. కుప్పం చేజారి పోతోందని చంద్రబాబు అంతరాత్మకు తెలిసిందని, అందుకే ఆయన అక్కడే మకాం వేశారని అన్నారు.
కుప్పం నియోజకవర్గానికి 33 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు, కనీసం కుప్పం బ్రాంచ్ కెనాల్ ని కూడా పూర్తి చేసుకోలేకపోయారని మండిపడ్డారు అంబటి రాంబాబు. ముఖ్యమంత్రిగా అధికారం వెలగబెట్టిన సమయంలో కూడా కుప్పంని పట్టించుకోని బాబు, ఇప్పుడు పదే పదే అక్కడే చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు అంబటి. చంద్రబాబుకి కుప్పం అంటే భయం పుట్టుకొచ్చిందని అన్నారాయన. కుప్పం చేజారి పోతోందని చంద్రబాబు అంతరాత్మకు తెలిసిందని, అందుకే ఆయన అక్కడే మకాం వేశారని అన్నారు.
ఇప్పుడు కాలుతోంది, రేపు కూలుతుంది..
కుప్పం ఇప్పుడు కాలుతోందని, రేపు కూలుతుందని అన్నారు అంబటి రాంబాబు. మూడేళ్ళ జగన్ పాలనలో చంద్రబాబుకి మిగిలింది కేవలం ఓటమి మాత్రమేనని, ఆ ముచ్చట 2024లో తీరిపోతుందని చెప్పారు. 33 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి కూడా కుప్పంకు చంద్రబాబు ఏమీ చేసుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు అన్నీ పోగొట్టుకున్నారని, ఇప్పుడు కుప్పం ప్రజలు చంద్రబాబు పక్షాన లేరని, జగన్ పక్షాన ఉన్నారని చెప్పారు. స్థానిక ఎన్నికల ఫలితాలతో ఇప్పటికే ఈ విషయం రుజువైందన్నారు అంబటి.
వైసీపీ నేతలు స్వాగతం పలకాలా..?
కుప్పం నియోజకవర్గం చంద్రబాబు సొత్తేమీ కాదని అన్నారు అంబటి. చంద్రబాబు పర్యటనలో వైసీపీ జెండాలు కనపడితే అంత అసహనం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తలు జెండాలు కట్టుకుంటే చంద్రబాబుకొచ్చిన బాధేంటని నిలదీశారు. పోనీ కుప్పంలో వైసీపీ నేతలు కూడా చంద్రబాబుకి స్వాగతం పలకాలా అంటూ వెటకారమాడారు. మూడురోజులుగా కుప్పంలో చంద్రబాబు ప్రదక్షిణలు చేస్తున్నా ఆయన్ని ఎవరూ పట్టించుకోవడంలేదని చెప్పారు అంబటి. ఈ రెండేళ్లే కుప్పంలో చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉంటారని, ఆ తర్వాత అది వైసీపీ వశమవుతుందని జోస్యం చెప్పారు.