కూటమి వల్ల వైసీపీకి నష్టం లేదు.. అంబటి లాజిక్ ఏంటంటే..?
సిద్ధం సభలో మేనిఫెస్టో విడుదలయ్యే అవకాశాలున్నాయని, తాము కూడా జగన్ మాటలకోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు మంత్రి అంబటి.
ఏపీలో టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ కూడా చేరడం వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం లేకపోవడంతో ప్రతిపక్ష కూటమికే లాభం ఎక్కువగా ఉంటుందనే అంచనాలున్నాయి. అయితే ఎవరెన్ని కూటములు కట్టినా తమకొచ్చే నష్టమేమీ లేదంటున్నారు మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ-జనసేన-బీజేపీ కలసినా వైసీపీకి ఎన్నికల్లో ఇబ్బంది లేదని చెప్పారు. తనదైన లాజిక్ తో కూటమి ఎఫెక్ట్ జీరో అని వివరించారు అంబటి.
ఏపీలో 50శాతం కంటే ఎక్కువమంది ఓటర్లు వైసీపీకి మద్దతు తెలుపుతున్నారని, వారి ఓటు కచ్చితంగా వైసీపీకే పడుతుందని చెప్పారు మంత్రి అంబటి. మిగతా ఓట్లన్నీ కలసినా, విడివిడిగా ఉన్నా తమకొచ్చే నష్టమేమీ లేదన్నారు. కచ్చితంగా రెండోసారి జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని తేల్చి చెప్పారు అంబటి. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కట్టినా కూడా ప్రతిపక్ష పాత్ర పోషించడానికి మాత్రమే వారు పనికొస్తారని, వైసీపీ విజయావకాశాలను దెబ్బతీయడం కూటమి వల్ల కాదని అన్నారు అంబటి.
బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగే చివరి సిద్ధం సభ సూపర్ సక్సెస్ అవుతుందని అన్నారు అంబటి రాంబాబు. 15 లక్షలకు మించి ప్రజలు సభకు హాజరవుతారన్నారు. ఏపీలో 90 శాతం మందికి పైగా ప్రభుత్వ పథకాలు అందాయని, వారందరి ఆశీస్సులు తమకే ఉంటాయన్నారు. పవన్ కల్యాణ్ సీఎం కావాలని కాపులందరూ ఎదురు చూశారని, కానీ పవన్ మాత్రం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నారని జనసైనికులు ఈ విషయం గమనించారన్నారు. సిద్ధం సభలో మేనిఫెస్టో విడుదలయ్యే అవకాశాలున్నాయని, తాము కూడా జగన్ మాటలకోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు అంబటి.