ఏపీలో జనవరి నుంచి మిల్లెట్ మహోత్సవాలు.. - ఐదేళ్లలో 5.25 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం
2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో రైతులకు దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో సిరి ధాన్యాల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఇందుకు గాను వచ్చే ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు మిల్లెట్ మహోత్సవాల పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. వచ్చే ఐదేళ్ల కాలంలో మిషన్ మిల్లెట్ కింద 5 లక్షల 25 వేల ఎకరాల్లో సాగు చేయడం ద్వారా 5 లక్షల 39 వేల టన్నుల దిగుబడులను అదనంగా సాధించాలని లక్ష్యంగా నిర్దేశించింది.
రాగులు, కొర్రల సాగుకు ప్రాధాన్యం..
మిల్సెట్స్ సాగులో భాగంగా ప్రధానంగా రాగులు, కొర్రలు సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాగులు 3 లక్షల 46 వేల ఎకరాల్లో, కొర్రలు లక్షా 54 వేల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. అందుకు అనువైన ప్రాంతాలున్న మండలాలను జిల్లాల వారీగా ఇప్పటికే అధికారులు మ్యాపింగ్ చేశారు. ఈ ఏడాది కొత్తగా 50 వేల ఎకరాలు సాగులోకి తేవాలని లక్ష్యంగా తీసుకున్నారు. రబీలో ఆరుతడి పంటలుగా బోర్ల కింద సిరి ధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నారు.
రైతుల్లో అవగాహన కల్పనే లక్ష్యంగా..
2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో రైతులకు దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అధికారులు జనవరిలో మిల్లెట్స్ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ఫిబ్రవరిలో కరపత్రాలు, పోస్టర్ల పంపిణీ, ప్రదర్శనల ద్వారా రైతులకు అవగాహన కల్పించనున్నారు. మార్చిలో రాష్ట్ర, జిల్లా స్థాయి వర్క్‌షాప్‌ల నిర్వహిస్తారు. ఏప్రిల్‌లో సిరి ధాన్యాల సాగు, అభివృద్ధిపై బుక్‌లెట్లను పంపిణీ చేస్తారు. మే నెలలో జిల్లాల స్థాయిలో రోడ్ షోలు, ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తారు. జూన్‌లో మిల్లెట్లు సాగు చేసే రైతులకు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్ కోసం శిక్షణ అందించనున్నారు. జూలైలో అధికారులు గుర్తించిన క్లస్టర్లలో డిమాన్‌స్ట్రేషన్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేస్తారు. చిరు ధాన్యాల్లో పోషక విలువలపై ఆగస్టులో పాఠశాలల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెప్టెంబర్‌లో ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకంలో చిరు ధాన్యాల వినియోగానికి శ్రీకారం చుడతారు. వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరి హరికిరణ్ ఈ వివరాలు వెల్లడించారు.