జగన్ కి నెల్లూరు చాలా ప్రత్యేకం.. ఎందుకంటే..?

గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన నెల్లూరు.. ఈసారి ఆ పార్టీకి ఎలాంటి ఫలితాన్నిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement
Update:2024-04-06 11:51 IST

సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' బస్సుయాత్ర నేడు నెల్లూరులో కొనసాగుతోంది. ఈరోజు యాత్ర 9వరోజు. చింతారెడ్డిపాలెం నుంచి బయలుదేరి, కోవూరు క్రాస్, సున్నపు బట్టి, తిప్ప, గౌరవరం మీదుగా యాత్ర కొనసాగుతుంది. సాయంత్రం కావలి వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో జగన్ వైసీపీ అభ్యర్థులను పరిచయం చేస్తూ, స్థానిక రాజకీయ పరిస్థితులపై కూడా ప్రసంగించే అవకాశముంది. ఈరోజు జగన్ ప్రసంగం ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంది.


జగన్ కి నెల్లూరు ఎందుకు ప్రత్యేకం..?

గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు.. జిల్లా పరిధిలోకి వచ్చే నెల్లూరు, తిరుపతి ఎంపిీ స్థానాలు కూడా వైసీపీ గెలుచుకుంది. దాంతోపాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి ముగ్గురు రాజ్యసభ సభ్యులు వైసీపీలో ఉండేవారు. విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావు వైసీపీ తరపున రాజ్యసభ సభ్యులుగా ఉండేవారు. నెల్లూరు అంటే వైసీపీ, వైసీపీ అంటే నెల్లూరు అన్నట్టుగా రాజకీయాలుండేవి. ప్రస్తుతం పరిస్థితులు తారుమారయ్యాయి. 10మంది ఎమ్మెల్యేలలో నలుగురు పక్క పార్టీల్లోకి వెళ్లిపోయారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, వెంకటగిరిలో వైసీపీ టికెట్ పై గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరినా టికెట్ రాకపోవడంతో సైలెంట్ గా ఉన్నారు. గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీ గూటికి చేరారు, నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన భార్య ప్రశాంతి రెడ్డి కోవూరు ఎమ్మెల్యేగా టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. ఐదేళ్లలో ఈ జిల్లాలో పరిస్థితులు తారుమారయ్యాయి.

వైసీపీ నుంచి లీడర్లు వెళ్లినా కేడర్ వెళ్లలేదని ధీమాగా ఉంది అధిష్టానం. ఈ ధీమా రేపు ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి. విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా రావడంతో వైసీపీ కేడర్ లో ఉత్సాహం పెరిగింది. పార్టీ ఫిరాయించిన వారందర్నీ ఓడించాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు జగన్. అందుకే నెల్లూరుపై ఫోకస్ పెట్టారు. ఈరోజు కావలి మీటింగ్ లో కూడా స్థానిక రాజకీయాలను జగన్ ప్రస్తావించే అవకాశముంది. పార్టీ మారిన వారి గురించి సీఎం ఎలాంటి కామెంట్లు చేస్తారో చూడాలి. గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన నెల్లూరు.. ఈసారి ఆ పార్టీకి ఎలాంటి ఫలితాన్నిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 

Tags:    
Advertisement

Similar News